పెళ్లి ఒత్తిడితో యువ‌తి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

by Ratna Kumari |

పెళ్లి ఒత్తిడితో యువ‌తి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన సంఘ‌ట‌న మేడిప‌ల్లి పోలీస్ స్టేష‌న్ పరిధిలో చోటు చేసుకుంది.

పెళ్లి ఒత్తిడితో యువ‌తి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం
X
దిశ‌, మేడిప‌ల్లి : పెళ్లి ఒత్తిడితో యువ‌తి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన సంఘ‌ట‌న మేడిప‌ల్లి పోలీస్ స్టేష‌న్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మ‌హ‌బూబాబాద్ జిల్లాకు చెందిన బ‌క్క‌త‌ట్ల మ‌మ‌త (18) కుటుంబంతో క‌లిసి మేడ్చ‌ల్ జిల్లా మేడిప‌ల్లిలో నివ‌సిస్తూ డిగ్రీ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతోంది. కుటుంబ ఆర్థిక ప‌రిస్థితుల నేప‌థ్యంలో త‌ల్లిదండ్రులు ఆమెకు వివాహం జ‌రిపించాల‌ని నిర్ణ‌యించి.. ఇటీవ‌లే పెళ్లి నిశ్చ‌యించారు. మ‌మ‌త మాత్రం పెళ్లి వ‌ద్దు.. ఉన్న‌త చ‌దువులు కొన‌సాగిస్తాన‌ని తెలిపింది. త‌ల్లిదండ్రులు న‌చ్చ‌జెప్ప‌డంతో ఇష్టం లేకున్నా పెళ్లికి ఒప్పుకుంది. ఈనెల 23న కుటుంబ స‌భ్యులు స్వ‌గ్రామానికి వెళ్లేందుకు సిద్ధంఅవుతుండ‌గా.. మ‌మ‌త స్నానానికి వెళ్లింది. చాలా సేపు బ‌య‌టికీ రాక‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన కుటుంబ స‌భ్యులు త‌లుపు త‌ట్టి చూడగా స్పంద‌న లేక‌పోవ‌డంతో స్థానికుల స‌హాయంతో త‌లుపు తెరిచారు. లోప‌ల ఆమె ఉరేసుకొని అప‌స్మార‌క స్థితిలో క‌నిపించింది. త‌క్ష‌ణ‌మే స‌మీప ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించ‌గా.. ప‌రిస్థితి విష‌మించ‌డంతో వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ఏప్రిల్ 27 తెల్ల‌వారుజామున మమ‌త మృతి చెందింది. ఈ ఘ‌ట‌న పై ఎవ‌రి పై అనుమానం లేద‌ని పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. కేసున‌మోదు చేసుకొని పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.
Next Story