నిద్రపోతున్న భర్తను చంపిన భార్య.. 60 ఏళ్ల వయసులో ఇదేం పని..?

by Bhoopathi Nagaiah |

నిద్రలో ఉన్న భర్తను ఇనుపరాడ్‌తో తలపై మోది భార్య హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

నిద్రపోతున్న భర్తను చంపిన భార్య.. 60 ఏళ్ల వయసులో ఇదేం పని..?
X

దిశ, అమలాపురం: నిద్రలో ఉన్న భర్తను ఇనుపరాడ్‌తో తలపై మోది భార్య హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలంలోని నడిపూడి గ్రామపంచాయతీ పరిధిలోని రాంజీ కాలనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటనను శుక్రవారం మధ్యాహ్నం వరకు బయటకు రానీయకుండా చూసిన భార్య, ఆపై భర్తను ఎవరో చంపి పారిపోయారని బంధువులకు, చుట్టుపక్కల వారికి తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు అమలాపురం సీఐ ప్రశాంత్ కుమార్ సారథ్యంలో దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు దొమ్మేటి రాంబాబు(60) కాకినాడ ఆర్టీసీ డిపోలో స్క్వాడ్ టీమ్‌లో పనిచేస్తుండగా అక్టోబర్ చివరలో రిటైర్ కానున్నాడు. ఆయనకు భార్య వెంకటరమణ, చెన్నైలో నివసిస్తున్న ఒక కుమార్తె హిమబేబి ఉన్నారు. భార్యతో కలిసి రాంబాబు రాంజీ కాలనీలోని ఇంట్లో నివసించేవాడు.

భర్త ప్రతిరోజూ మద్యం తాగి ఆలస్యంగా ఇంటికి వచ్చి చిత్రహింసలు పెట్టేవాడని, మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని జీతం డబ్బులు వ్యసనాలకు ఖర్చు చేస్తున్నాడని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. భర్త టార్చర్ భరించలేకనే రాంబాబును చంపాలని నిర్ణయించుకున్నట్లు ఆమె పోలీసుల ముందు ఒప్పుకుంది. గురువారం రాత్రి కూడా వేధింపులకు పాల్పడడంతో నిద్రిస్తున్న సమయంలో ఇనుపరాడ్‌తో తలపై మోది రాంబాబును హత్య చేసినట్లు విచారణలో బయటపడింది. మొదట్లో భార్య ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా పోలీసులు క్లూస్ టీమ్‌ను రప్పించి దర్యాప్తు చేపట్టగా, ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ ప్రశాంత్ కుమార్ తెలిపారు.


Next Story