- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియుడికి దాసోహం అయిన మహిళ.. అర్థరాత్రి నలుగురితో కలిసి అరాచకం.. ఏడాది తర్వాత బయటపడ్డ మిస్టరీ
భర్తతో ఏడడుగులు నడిచింది.. నువ్వే సర్వస్వం అన్నది. నా తోడు, నీడ, అండ, భరోసా, ధైర్యం నువ్వే అన్నది.

దిశ, వెబ్‌డెస్క్ : భర్తతో ఏడడుగులు నడిచింది.. నువ్వే సర్వస్వం అన్నది. నా తోడు, నీడ, అండ, భరోసా, ధైర్యం నువ్వే అన్నది. పుష్కరకాలం ప్రేమగా కాపురం చేసింది. అంతే భర్త బోర్ కొట్టేశాడు. పిల్లలు, కాపురం, బంధుత్వాలు, కన్నవాళ్లు ఇవన్నీ ఏం గుర్తుకు రాలేదు ఆమెకు. కళ్లు మూసినా, తెరిచినా ప్రియుడే కనిపించాడు. ఇంకేం.. తన రాసలీలలకు అడ్డురాకుండా ఉండాలని భర్తను నమ్మించి మోసం చేసింది. పక్కా స్కెచ్ వేసి భర్తను లేపేసింది. పోలీసులను సైతం బోల్తా కొట్టించి ప్రమాదవశాత్తు మరణంగా కేసు క్లోజ్ చేయించింది. కానీ చేసిన పాపం ఊరికే పోదన్న నానుడిని నిజం చేస్తూ ఏడాది తర్వాత భార్య బండారం బయటపడింది. సినిమా ట్విస్ట్‌లను మించి క్రైం థ్రిల్లర్ మూవీని తలపించిన ఈ మర్డర్ సత్యసాయి జిల్లాలో జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్, ఎస్బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డితో కలిసి ఎస్పీ రత్న వివరాలు వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం..
ధర్మవరం మండలం పోతుకుంట గ్రామానికి చెందిన అల్లె మంజునాథ, రామగిరి మండలం పోలెపల్లి గ్రామానికి చెందిన యమునను 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె. పెళ్లైన కొన్నాళ్లకు జీవనోపాధి కోసం పెనుగొండకు వచ్చి నివాసం ఉంటున్నారు. అక్కడే రోజువారి పనులు చేసుకుంటే జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో మంజునాథ మద్యానికి అలవాటు పడ్డాడు. రోజూ తాగుతూ యమున క్యారెక్టర్‌ను అనుమానిస్తూ వేధించడం ప్రారంభించాడు. ఇదే సమయంలో 2023లో రొద్దం మండలం లోచర్ల గ్రామానికి చెందిన సిద్దప్ప అనే వ్యక్తితో యమునకు పరిచయం అయింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఎక్కువ సమయం అతడితో గడుపుతూ ఎంజాయ్ చేసింది. ఈ విషయం భర్తకు తెలిసి నిలదీశాడు. ఈ విషయం తెలుసుకున్న సిద్దప్ప.. మంజునాథను అడ్డుతొలగించుకోవాలని యమునపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో పక్కా స్కెచ్ వేసి ప్రియుడికి వివరించింది.
ప్లాన్ ప్రకారం.. సిద్దులు తన స్నేహితులైన పరిగి మండలం ఉటకూరు గ్రామానికి చెందిన నూర్ మహమ్మద్, కర్ణాటకకు చెందిన మదన మోహన్, కొత్తూరుకు చెందిన పిట్టి సహయం తీసుకున్నాడు. వారంతా కలిసి ఏప్రిల్ 22, 2024న మద్యం తాగుదాం అని మంజునాథను నాగలూరు గ్రామశివారులోని పెద్దవంకలోకి తీసుకెళ్లారు. అక్కడ ఫుల్‌గా మద్యం తాగించారు. నలుగురు కలిసి మంజునాథ మెడకు టవల్ బిగించి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని చెరువులో పడేసి వెళ్లిపోయారు. ఆ సమయంలో భార్య యమున సైతం అక్కడే ఉన్నది. తెల్లారి ఏం తెలియని దానిలా ఏడుస్తూ.. తన భర్త మద్యం తాగి ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయాడని అటు పోలీసులను, ఇటు బంధువులను బురిడి కొట్టించింది. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లోనూ అలాగే వచ్చింది. కానీ మంజునాథ కుటుంబంలో ఎన్నో సందేహాలు అలాగే ఉండిపోయాయి.
భర్త చనిపోయినా యమునలో ఎలాంటి చింత లేకపోవడం.. ఆ తర్వాత కనిపించకుండా పోవడంతో మంజునాథ కుటుంబీకులు తన కుమారుడి మరణంపై సందేహాలు ఉన్నాయని ధర్మవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యమునపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతదేహానికి రీపోస్ట్‌మార్టం నిర్వహించడంతో దిమ్మతిరిగే నిజాలు వెలుగుచూశాయి. అక్రమ సంబంధం పెట్టుకున్న సిద్దులు, యముననే హత్యకు ప్లాన్ చేసినట్టు తెలిసింది. మంజునాథ మృతిచెందిన సమయంలోనూ నిందితులు అంతా ఒకేచోట ఉన్నట్టు సెల్ ఫోన్ టవర్ లోకేషన్ చూపించింది. టెక్నాలజీని ఉపయోగించి హత్యకు చేసిన ప్లాన్, వారి సంభషణ అన్ని వివరాలను సేకరించారు. హత్యలో భాగం పంచుకున్న ముగ్గురిని సోమవారం అరెస్ట్ చేశారు.
కానీ అసలు సూత్రదారులైన సిద్దులు, యమున హత్య జరిగిన నాటి నుంచి ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. వారి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, హత్య జరిగి ఏడాది దాటిన తర్వాత కేసు మిస్టరీ బయటపడటం జిల్లా ప్రజలను విస్మయానికి గురిచేసింది. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన ధర్మవరం రూరల్ సర్కిల్ సీఐ ప్రభాకర్, ధర్మవరం రూరల్ ఎస్ఐ పి.శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ చత్రు నాయక్, కానిస్టేబుల్స్ అనిల్ కుమార్, బాలకృష్ణలకు ఎస్పీ వి.రత్న ప్రశంస పత్రాలు, క్యాష్ రివార్డ్స్ అందజేసి అభినందించారు.






