పట్టాలు తప్పిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం

by Kema Shiva Kumar |

ముంబై-సోలాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పుణే రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది.

పట్టాలు తప్పిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర (Maharashtra)లో తృటిలో భారీ రైలు ప్రమాదం తప్పింది. ముంబై నుంచి సోలాపూర్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైలు పట్టాలు తప్పింది. పుణే రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ట్రైన్ తక్కువ స్పీడ్‌లో ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ముంబై నుంచి సోలాపూర్ వెళ్తున్న ఈ హైస్పీడ్ రైలు పుణే రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నెంబర్ 3 సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా పట్టాలు తప్పింది. రైలు చక్రాలు పట్టాల నుంచి కిందకు దిగడంతో భారీ శబ్దం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ రైలును నిలిపివేశారు.

ప్రమాదానికి కారణం ఇదే..

ప్రాథమిక సమాచారం ప్రకారం.. స్టేషన్ సమీపంలోని డైమండ్ క్రాసింగ్ (Diamond Crossing) వద్ద తలెత్తిన సాంకేతిక లోపమే ఈ ప్రమాదానికి కారణమని రైల్వే అధికారులు భావిస్తున్నారు. పట్టాలను మార్చే క్రమంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల రైలు పక్కకు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, వారిని ఇతర మార్గాల ద్వారా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పుణే రైల్వే డివిజన్ అధికారులు ప్రకటించారు. వందే భారత్ రైలు పట్టాలు తప్పడంతో పుణే మీదుగా వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది. రైల్వే ఇంజనీరింగ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని, పట్టాలు తప్పిన కోచ్‌లను తిరిగి పట్టాలెక్కించే (Restoration) పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతన్నారు.

Next Story