ఆదిలాబాద్ రిమ్స్‌లో కలకలం: పీజీ వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులు

by Kema Shiva Kumar |

ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి.

ఆదిలాబాద్ రిమ్స్‌లో కలకలం: పీజీ వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పోకిరీ చేష్టలకు అడ్డాగా మారుతున్నాయి. తాజాగా ఆదిలాబాద్‌ (Adilabad)లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) మెడికల్ కాలేజీలో తీవ్ర కలకలం రేపుతోంది. తోటి సిబ్బందికి రక్షణగా ఉండాల్సిన ఒక నర్సింగ్ అధికారే, పీజీ చదువుతున్న ఓ మహిళా వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఆపరేషన్ థియేటర్‌లోనే..

పోలీసులు సమాచారం కథనం మేరకు రిమ్స్ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌ (OT)లోనే ఈ ఘోరం జరిగింది. విధుల్లో ఉన్న సదరు పీజీ వైద్య విద్యార్థిని ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసుకుని, అక్కడే పనిచేసే ఓ నర్సింగ్ అధికారి (Nursing Officer) ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఊహించని ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన బాధితురాలు, వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆదిలాబాద్ పోలీసులు తక్షణమే స్పందించి కేసు నమోదు చేశారు. ఆసుపత్రి పరిసరాల్లో విచారణ జరిపి, ప్రాథమిక ఆధారాలు సేకరించిన అనంతరం నిందితుడైన నర్సింగ్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ ఘటన జరిగి కొన్ని రోజులు గడుస్తున్నప్పటికీ, ఆసుపత్రి పరువు ఎక్కడ పోతుందోననే కారణంతో యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లుగా తెలుస్తోంది.

విద్యార్థుల ఆందోళన..

అయితే, బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ, ఆస్పత్రి ప్రాంగణంలోనే పీజీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడటంపై రిమ్స్ జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో మహిళా వైద్యులకు, విద్యార్థినులకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story