కొత్త సంవత్సర వేళ తీరని విషాదం.. ముగ్గురు బిడ్డలను చంపి తండ్రి ఆత్మహత్య

by Malleboina Mahesh |   (  Updated:2026-01-01 05:14:51  IST  )

కొత్త సంవత్సర వేళ అందరూ సంబరాల్లో మునిగి తేలుతుంటే.. నంద్యాల జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం తొడుములదీన్నేల గ్రామం మాత్రం విషాదంలో మునిగిపోయింది.

కొత్త సంవత్సర వేళ తీరని విషాదం.. ముగ్గురు బిడ్డలను చంపి తండ్రి ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: కొత్త సంవత్సర వేళ అందరూ సంబరాల్లో మునిగి తేలుతుంటే.. నంద్యాల జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం తొడుములదీన్నేల గ్రామం మాత్రం విషాదంలో మునిగిపోయింది. ఒక తండ్రి తన ముగ్గురు కన్నబిడ్డలనే కాలయముడిలా మారి బలితీసుకున్నాడు. మద్యం మత్తులో ముగ్గురు బిడ్డలను చంపి తండ్రి ఆత్మహత్య చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూ ఇయర్ వేళ పీకలదాకా తాగిన వేముల పాటి సురేంద్ర (34) అనే వ్యక్తి.. రాత్రి ఇంటికి వచ్చిన తన ముగ్గురు పసిపిల్లలైన కావ్య (7), ధ్యానేశ్వరి (4), రెండేళ్ల పసికందు సూర్యగగన్‌ను అత్యంత దారుణంగా హత్య చేశాడు. కళ్లముందే తండ్రి చంపుతుంటే ఆ పసి ప్రాణాలు ఎంతలా విలవిలలాడాయోనని తలచుకుని స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

పిల్లలను పొట్టనబెట్టుకున్న అనంతరం, చేసిన ఘోరం గుర్తొచ్చిందో ఏమో కానీ, సురేంద్ర కూడా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. నూతన ఏడాదిలో వెలుగులు నిండాల్సిన ఆ ఇంట, తండ్రి చేసిన ఉన్మాద చర్యతో ఒకేసారి నాలుగు శవాలు పడి ఉండటం చూసి గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. మద్యం మత్తులో కన్న ప్రేమను మర్చిపోయి, చిన్నారుల భవిష్యత్తును చిదిమేసిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కాగా ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story