- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంకా పెండింగ్‌లోనే ఫార్ములా ఈ కార్ రేసు ఫైల్.. కేటీఆర్‌ను నిజంగానే కిషన్ రెడ్డి కాపాడుతున్నారా?
మూడు వారాలుగా ఫార్ములా ఈ కార్ రేసు కేసు ఫైల్ రాజ్ భవన్‌లోనే ఉంది. ఇంతవరకు దానిపై గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఏ నిర్ణయం తీసుకోలేదు.

దిశ, తెలంగాణ బ్యూరో: మూడు వారాలుగా ఫార్ములా ఈ కార్ రేసు కేసు ఫైల్ రాజ్ భవన్‌లోనే ఉంది. ఇంతవరకు దానిపై గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఏ నిర్ణయం తీసుకోలేదు. అసలు ఫైల్ క్లియర్ చేస్తారా? లేదా? అనే చర్చ ప్రస్తుతం జరుగుతున్నది. అయితే, బీజేపీ నాయకత్వం బీఆర్ఎస్ నేతలను కాపాడే ప్రయత్నాలు చేస్తుందని, అందుకే ప్రాసిక్యూషన్‌కు అనుమతి రావడం లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్నది. ఫార్ములా ఈ రేసు కేసులో ఏ–1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సెప్టెంబరు మొదటివారంలో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది. కానీ ఇంతవరకు గవర్నర్ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
కేటీఆర్‌కు అండగా బీజేపీ?
బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య రహస్య స్నేహం కొనసాగుతోందని కాంగ్రెస్ లీడర్లు సందర్భం వచ్చిన ప్రతిసారీ విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్య జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి సహకరించేందుకు తెలంగాణ వాదిగా ఉన్న ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయకుండా బీఆర్ఎస్ దూరంగా ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. పలు కేసుల్లో ప్రమేయం ఉన్న కేటీఆర్‌ను జైలుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఫార్ములా ఈ రేసు కేసులో ఏ–1గా ఉన్న కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయకుండా అడ్డుకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు. అందుకే మూడు వారాల క్రితం రాజ్ భవన్‌కు వెళ్లిన ఫైల్ ఇంతవరకు క్లియర్ కాలేదని హస్తం శ్రేణులు ఆరోపిస్తున్నారు.
ఫైల్‌తో పాటే అన్ని ఆధారాలు..
ప్రాసిక్యూషన్ చేసేందుకు కావాల్సిన ఆధారాలను సేకరించిన ఏసీబీ వాటన్నింటిని రాజ్‌భవన్‌కు పంపింది. అందులో ప్రధానంగా ‘క్విడ్ ప్రోకో’ జరిగిందని చెప్పేందుకు ఫార్ములా ఈ– రేసు నిర్వహణ ఏజెన్సీకి, బీఆర్ఎస్‌కు మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీల వివరాలను జత చేసింది. మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ ఆదేశాల మేరకే రేసు నిర్వహణ ఏజెన్సీకి రూ. 46 కోట్లు చెల్లించినట్లు ఐఏఎస్ అధికారి ఆరవింద్ కుమార్, హెచ్ఎండీఏ అధికారి బీఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు సదరు ఏజెన్సీ రూ.44 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను బీఆర్ఎస్ పార్టీ నుంచి కొనుగోలు చేసింది. అ లావాదేవీలు ఏఏ బ్యాంకుల ద్వారా జరిగాయో ఆ వివరాలను సైతం రాజ్ భవన్‌కు ఏసీబీ పంపించింది.
లీగల్ ఒపీనియన్ పేరుతో ఆలస్యం..
కేటీఆర్‌ను ప్రాసిక్యూషన్ చేసేందుకు ప్రభుత్వం నుంచి వచ్చిన రిక్వెస్టుపై గవర్నర్ ఆఫీసు లీగల్ ఒపీనియన్‌కు వెళ్లినట్లు తెలిసింది. ఏసీబీ పంపిన ఆధారాలు సరిగా ఉన్నాయా? లేదా? అనే కోణంలో క్రాస్‌చెక్ చేసే ప్రక్రియ సైతం పూర్తయినట్లు సమాచారం. అయితే, ఈ కేసుతో తమ పార్టీకి రాజకీయంగా చేకూరే లాభనష్టాలపై కమలం నేతలు క్లారిటీకి రాలేకపోతున్నారనే టాక్. అందుకే రాజ్ భవన్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడం లేదని, న్యాయసలహా పేరుతో ఆలస్యం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.






