బ్రాహ్మణపల్లిలో విషాదం.. గ‌డ్డి మందు తాగి యువ‌కుడు మృతి

by Nallavelli.Anjaneyulu |

తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఓ కుమారుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

బ్రాహ్మణపల్లిలో విషాదం.. గ‌డ్డి మందు తాగి యువ‌కుడు మృతి
X

​దిశ, తాడ్వాయి : తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఓ కుమారుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన చెట్కూరి మల్లయ్య నెల పదిహేను రోజుల క్రితం గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అప్పటి నుంచి ఆయన కుమారుడు చెట్కూరి యశ్వంత్ (24) తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. తండ్రి జ్ఞాపకాల నుంచి బయటపడలేక, తాను కూడా చనిపోతానంటూ తరచూ కుటుంబ సభ్యుల వద్ద వాపోయేవాడు. ఐదు రోజుల క్రితం యశ్వంత్ పని నిమిత్తం కామారెడ్డికి వెళ్తానని ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే, బ్రాహ్మణపల్లి గ్రామ శివారులోకి చేరుకోగానే వెంట తెచ్చుకున్న ప్యారాకుట్ అనే గడ్డి మందును తాగి పడిపోయాడు. గమనించిన టెక్రియల్ గ్రామస్తులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు బాధితుడిని హుటాహుటిన ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగ‌ళ‌వారం మధ్యాహ్నం యశ్వంత్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై నరేష్ కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పత్రికి తరలించి, దర్యాప్తు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. చేతికి అందిన కొడుకు మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Next Story