జూబ్లీహిల్స్ ఏరియాలో 2 నెలల్లో నేపాలీల దోపీడీలు మూడు

by Malleboina Mahesh |

జూబ్లీహిల్స్‌లో నేపాలీ పనిమనుషులు దోపిడీలకు తెగబడుతున్నారు. రిటైర్డ్ డీజీపీ ఇంట్లో జరిగిన హత్యతో పోలీసులు అప్రమత్తమై, పనిమనుషుల నియమకంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెల్లడించారు.

జూబ్లీహిల్స్ ఏరియాలో 2 నెలల్లో నేపాలీల దోపీడీలు మూడు
X

దిశ, సిటీక్రైం: హైదరాబాద్ నగరంలో అత్యంత సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్ ప్రాంతంలో నేపాలీల దోపీడీల ఘటనలు కలవర పెడుతున్నాయి. రెండు నెలల్లో సంపన్నుల ఇండ్లలో పని మనుషులుగా చేరి చోరీలు, దోపీడీలకు తెగబడిన ఘటనలు ఇప్పుడు మూడు జరిగాయి. తాజాగా జరిగిన కేసులో ప్రాణాలు పోవడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఒక్కసారిగా పోలీసులు ఉలికిపడ్డారు. అందులో రిటైర్డ్ డీజీపీ ఇంట్లోనే ఈ దారుణ ఘటన జరగడం, ఆయన భార్యను హతమార్చడం అంశం పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించింది. ఘటనా స్థలాన్ని డీజీపీ, అదనపు డీజీపీ, పోలీసు కమిషనర్లతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు.

24 గంటల ముందే రెక్కీ?

జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 71 ప్రశాసన్ నగర్ లో నివాసం ఉంటున్న మాజీ డీజీపీ వినయ్ రంజన్ రే ఇంట్లో పని చేస్తున్న నేపాల్ దేశానికి చెందిన కల్పన మరో ముగ్గురితో కలిసి ఘటనకు ముందు రోజే రెక్కీ చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలుస్తున్నది. బుధవారం మధ్యాహ్నం సమయంలో దుండగులు మాజీ డీజీపీ ఇంట్లోకి ఎలా ప్రవేశించాలి? ఆ తర్వాత ఎలా పారిపోవాలనే విషయాలపై పరిశీలించారు. దీని కోసం ఇంటి పక్కనున్న పార్క్ వైపు నుంచి మాజీ డీజీపీ ఇంటి వరకు వచ్చారని పోలీసులు పరిశీలించిన సీసీ కెమెరాల ద్వారా తెలిసింది. ఇలా కల్పన.. ఇద్దరు పురుషులు, మరో మహిళతో కలిసి దోపీడీకి స్కెచ్ వేసిందని పోలీసుల దర్యాప్తులో బయటపడుతుంది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1 నుంచి 2 గంటల సమయంలో చోటచేసుకుందని విచారణలో కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఘటనా స్థలంలో దొరికిన కొన్ని కీలక ఆధారాలు నిందితులకు పాత నేర చరిత్ర ఉందని తెలుస్తోంది. మొత్తం 10 టీమ్స్ రంగంలోకి దిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

నేపాలీ పని మనుషులతో జాగ్రత్త : సీపీ సజ్జనార్

జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నెలల కిందట జరిగిన 2 ఘటనలు దృష్టి లో పెట్టుకొని పోలీసులు అప్రమత్తమయ్యే లోపల మూడో ఘటన కలవరపెడుతోంది. ఈ ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు.. నేపాల్ దేశాలకు చెందిన ఇండ్లలో పనులకు పెట్టుకున్న యజమానులను అలర్ట్ చేశారు. నేపాలీలను పనుల్లో పెట్టుకున్న వారు జాగ్రత్తగా ఉండాలన్నారు. వారిని నమ్మొద్దని సూచించారు. వారిపై నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు. నేపాలీలకు సంబంధించిన పూర్తి వివరాలు, వారి ఫోన్ నెంబర్లను స్థానిక పోలీసులకు ఇవ్వాలని తెలిపారు. ఈ నేపాలీ పని మనుషులను నమ్మి ఇంట్లో అన్ని చోట్ల తిరిగేలా అవకాశం ఇవ్వొద్దని తెలిపారు. వారిని ఎవరు కలవడానికి వస్తున్నారు? వారు ఎవరెవరిని కలుస్తున్నారు? ఇంటికి వారికి సంబంధించిన వ్యక్తులు ఎవరు వస్తున్నారు? వంటి విషయాలను ఆరా తీయాలన్నారు. అనుమానం ఉంటే వారి సమాచారాన్ని పోలీసులకు అందించాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్ కోరుతున్నారు.

Next Story