విషాదాన్ని మిగిల్చిన వైద్య విద్యార్థి మృతి

by Ratna Kumari |

జడ్చర్ల మండలం కుర్వపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పలుగుగడ్డ తండాకు చెందిన గిరిజన విద్యార్థి కాట్రావత్ సురేష్ (28) ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతూ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

విషాదాన్ని మిగిల్చిన వైద్య విద్యార్థి మృతి
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల మండలం కుర్వపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పలుగుగడ్డ తండాకు చెందిన గిరిజన విద్యార్థి కాట్రావత్ సురేష్ (28) ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతూ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సీనియర్ల ర్యాగింగ్ వేధింపులు తట్టుకోలేక విషం ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. సురేష్ మృతిపై మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలుగుగడ్డ తండాకు చేరుకుని ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.


“ఎంతో కష్టపడి పీజీ సీటు సాధించిన గిరిజన విద్యార్థి ఇలా మృతి చెందడం బాధాకరం. పేద విద్యార్థి చనిపోతే స్పందించని వ్యవస్థ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వ పరంగా పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తన వంతుగా రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ఈ ఘటనతో పలుగుగడ్డ తండాలో విషాద వాతావరణం నెలకొంది.

Next Story