చైల్డ్ ట్రాఫికింగ్ కేసుల్లో కదిలిన డొంక.. నలుగురు ఏజెంట్లు అరెస్ట్

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-06 03:03:51  IST  )

అభంశుభం తెలియని, ముక్కుపచ్చలారని పసిప్రాణాలను అంగట్లో సరుకుల్లా అమ్మేస్తున్న భారీ నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు.

చైల్డ్ ట్రాఫికింగ్ కేసుల్లో కదిలిన డొంక.. నలుగురు ఏజెంట్లు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: అభంశుభం తెలియని, ముక్కుపచ్చలారని పసిప్రాణాలను అంగట్లో సరుకుల్లా అమ్మేస్తున్న భారీ నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌ (Gujarat)లో పుట్టిన శిశువులను విమానాలు, రైళ్లలో ఓ గ్యాంగ్ గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌‌ (Hyderabad)కు తరలిస్తోంది. గత రెండేళ్లుగా ఈ దందాను నిరాటంకంగా కొనసాగిస్తోంది. ఓ మిస్సింగ్ కేసు విషయమై రంగంలోకి దిగిన అహ్మదాబాద్ పోలీసులు (Ahmadabad Police) ఈ ముఠా గుట్టును రట్టు చేశారు. తాజాగా నలుగురు ఏజెంట్లను అరెస్ట్ చేయగా.. హైదరాబాద్‌లో వారికి సహకరిస్తున్న ఐవీఎఫ్ (IVF) ఏజెంట్లు, మధ్యవర్తులపై నిఘా పెంచారు. ఇందులో ప్రధాన సూత్రధారుల ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. గత రెండేళ్లలో ఇప్పటి వరకు 25 మంది శిశువులను విక్రయించినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఆ పిల్లల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.

కలర్, జెండర్ బట్టి రేట్ ఫిక్స్..

అయితే, ఈ ముఠా శిశువులను జెండర్, కలర్‌ను బట్టి విభజించి.. మగ శిశువులను రూ. 10 లక్షల నుంచి 15 లక్షల వరకు, ఆడ శిశువులను రూ. 5 లక్షల నుంచి 8 లక్షల వరకు విక్రయిస్తున్నట్లుగా అహ్మదాబాద్ పోలీసులు తెలిపారు. తెల్లగా ఉన్న శిశువులకు మరింత డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. గుజరాత్‌లోని పేద కుటుంబాల నుంచి లేదా అక్రమ సంబంధాల వల్ల పుట్టిన పిల్లలను ఈ గ్యాంగ్ కేవలం రూ. 1 నుంచి రూ. 2 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అక్కడి నుంచి మహిళా ఏజెంట్ల ద్వారా రైలు లేదా బస్సు మార్గాల్లో హైదరాబాద్‌కు తరలిస్తుంటారని వెల్లడించారు. అదేవిధంగా పోలీసుల కళ్లుగప్పి మహిళలను తల్లుల వేషంలో పంపించారని పోలీసులు స్పష్టం చేశారు.

చైల్డ్ ట్రాఫికింగ్ (Child Trafficking) ముఠాలో చాలా మంది గతంలో ఫెర్టిలిటీ సెంటర్లలో ఏజెంట్లుగా పనిచేసిన వారేనని తెలిపారు. దంపతులకు పిల్లలు కలగని బలహీనతను ఆసరాగా చేసుకుని, వారికి దత్తత పేరుతో మోసగించి ఈ పిల్లలను విక్రయిస్తున్నారు. శిశువుల విక్రయం, కొనుగోలు రెండూ తీవ్రమైన నేరాలని.. సంతానం లేని వారు పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటే కేవలం అధికారిక మార్గాల ద్వారానే వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

Next Story