ఆ కారు డ్రైవర్ నన్ను చంపాలని చూశాడు.. ఎస్ఐ సంచలన ప్రకటన

by Bhoopathi Nagaiah |

తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు దాడులకు తెరలేపారు దుండగులు. ఒకే రోజు ఇద్దరు పోలీసులపై హత్యాయత్నం చేశారు.

ఆ కారు డ్రైవర్ నన్ను చంపాలని చూశాడు.. ఎస్ఐ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్ : పోలీసులపై దాడులు చేయడానికి ఏమాత్రం వెనకడటం లేదు నేరస్తులు. ఆదివారం ఒక్కరోజే వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు పోలీసులపై హత్యాయత్నం జరగడం సంచలనంగా మారింది. నిజామాబాద్‌లో లేడీ కానిస్టేబుల్‌ను గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టగా.. రంగారెడ్డి జిల్లా యాచారంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఎస్ఐని కారుతో ఢీకొట్టి కారుతో లాక్కెళ్లాడు ఓ మందుబాబు. ఈ రెండు ఘటనలతో పోలీస్ శాఖలో ఆందోళన నెలకొంది. తమ భద్రతపై పోలీసుల్లో చర్చ మొదలైంది. కాగా, గాయాలపాలైన ఎస్ఐ మధు ఇవాళ స్పందించారు. తనపై దాడి ఎలా జరిగిందో వివరించారు.

ఆ దుర్ఘటనను కళ్లకు కట్టిన ఎస్ఐ

‘‘యాచారం పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ఆదివారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఆ సమయంలో అటుగా వస్తున్న కారును కానిస్టేబుల్ ఆపే ప్రయత్నం చేశాడు. కానీ కారు డ్రైవర్ కానిస్టేబుల్‌ను తప్పించుకోని నా మీదకు వచ్చాడు. నేను ఆ కారును తప్పించుకునే క్రమంలో బానెట్‌పై పడ్డాను. అయినా డ్రైవర్ కారు ఆపకుండా వంద నుంచి 120 స్పీడులో దూసుకుపోయాడు. ఆపమని ఎంత అరిచినా పట్టించుకోలేదు. అదే సమయంలో ఓ టూవీలర్‌ను ఢీకొట్టాడు. దానిపై ఉన్న మహిళకు కాలు విరిగింది. అయినా అతడు కారు ఆపలేదు. అంత స్పీడ్‌లోనూ నేను కిందికి దూకే ప్రయత్నం చేసినా కుడివైపు డివైడర్లు ఉన్నాయి, ఎడమ వైపు దూకితే టైర్ల కింద పడే అవకాశం ఉంది. ఈలోపు మూలమలుపు రావడంతో దూకేశాను. నేను బానెట్‌పై ఉండగానే డ్రైవర్ 500 మీటర్ల వరకు నన్ను లాక్కెళ్లాడు. అతని ఉద్దేశం నన్ను చంపి పారిపోవాలనే ఉన్నది. ఇలాంటి దాడులకు మేము భయపడం. చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తాం’’ అని ఎస్ఐ మధు తెలిపారు.

విషమంగానే కానిస్టేబుల్ సౌమ్య ఆరోగ్య పరిస్థితి

మరోవైపు గంజాయి స్మగర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం రూ.10 లక్షలను మంజూరు చేసింది. ఇవాళ ఉదయం వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర నర్సింహ నిమ్స్‌కు వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సౌమ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉన్నప్పటికీ నిన్నటి కంటే ఇవాళ కొంత బెటర్‌గా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.

Next Story