మూడేళ్ల బాలునిపై వీధి కుక్కల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు

by Disha Web Desk 6 |
మూడేళ్ల బాలునిపై వీధి కుక్కల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: వీధి కుక్కలు మరోసారి వేట కుక్కల్లా మారాయి. కాంచన్ బాగ్ డీఆర్డీవో టౌన్ షిప్ లో మూడేళ్ల బాలునిపై మూకుమ్మడిగా దాడి చేసాయి. చిన్నారిని నోట కరిచి లాక్కెళ్లే యత్నం చేసాయి. ఇది చూసిన టౌన్ షిప్ వాసులు కుక్కలను తరిమి కొట్టారు. అయితే, అప్పటికే బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. రక్షణ శాఖ ఉద్యోగి వికాస్ కుమార్ డీఆర్డీవో టౌన్ షిప్ లో సీ టైప్ క్వార్టర్స్ లో ఉంటున్నాడు. అతని కుమారుడు అతర్వ్ వర్మ (3). గురువారం రాత్రి అతర్వ్ వర్మ ఇంటి ముందు ఆడుకుంటుండగా అయిదు కుక్కలు ఒకేసారి దాడి చేసాయి. ఆ చిన్నారిని నోట కరిచి లాక్కొని పోవటానికి ప్రయత్నించాయి. తీవ్రంగా గాయపడ్డ అతర్వ్ ఏడుపు విని ఆ బాలుని తండ్రి వికాస్ కుమార్, స్థానికులు పరుగున వచ్చి కుక్కలను తరిమి కొట్టారు. అనంతరం బాలున్ని అపోలో ఆస్పత్రికి తరలించారు. కుక్కల దాడిలో బాలునికి తీవ్ర గాయ్యాలయ్యాయని వైద్యులు చెప్పారు. చికిత్స చేస్తున్నామని, ప్రస్తుతం బాలుని పరిస్థితి బాగానే ఉందన్నారు.

ఫిర్యాదులు చేసినా..

టౌన్ షిప్ లో కుక్కల బెడద అధికమయ్యిందని పలుమార్లు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని బాలుని తండ్రి వికాస్ కుమార్ చెప్పారు. డాగ్ స్క్వాడ్ సిబ్బందిని కలిసి కుక్కలను పట్టుకెళ్ళమని టౌన్ షిప్ వాసులతో కలిసి విజ్ఞప్తి కూడా చేసామన్నారు. దీనికి అయ్యే ఖర్చు కూడా భరించుకుంటామని చెప్పామన్నారు. అయినా, ఎవ్వరూ పట్టించుకోలేదని అన్నారు. రాత్రి రెండు క్షణాలు ఆలస్యం అయి ఉంటే తన బిడ్డ చనిపోయి ఉండేవాడని కన్నీళ్లతో తెలిపాడు.

Next Story