ఒంగోలు జిల్లాలో దారుణం.. తల్లిని సజీవదహనం చేసిన కొడుకు

by Naga Rani Yarlagadda |

ఆస్తి తగాదాల నేపథ్యంలో ఓ కొడుకు కన్నతల్లిని పొట్టనపెట్టుకున్నాడు.

ఒంగోలు జిల్లాలో దారుణం.. తల్లిని సజీవదహనం చేసిన కొడుకు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో అత్యంత పాశవిక ఘటన వెలుగుచూసింది. గద్దలగుంట ప్రాంతంలో కన్నతల్లి అని కూడా చూడకుండా ఓ కుమారుడు అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. మనస్పర్థల కారణంగా తన తల్లిని ఇంట్లోనే బంధించి నిప్పు పెట్టడంతో, ఆమె మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

స్థానిక సమాచారం ప్రకారం.. నిందితుడు తన తల్లితో కొంతకాలంగా గొడవ పడుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం వీరిద్దరి మధ్య మాట మాట పెరగడంతో ఆవేశానికి గురైన కుమారుడు, తల్లిని గదిలో వేసి బయట నుంచి తలుపులు వేసి నిప్పు అంటించాడు. మంటలు క్షణాల్లో ఇల్లంతా వ్యాపించాయి. లోపల ఉన్న వృద్ధురాలు కాపాడమని కేకలు వేసినప్పటికీ, నిందితుడు అడ్డుకోవడంతో ఆమె బయటకు రాలేకపోయింది. చూస్తుండగానే మంటలు తీవ్రరూపం దాల్చి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇంటి నుంచి దట్టమైన పొగ, మంటలు రావడం గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే ఆ వృద్ధురాలు పూర్తిగా కాలిపోయి శవంగా మారిపోయింది.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆస్తి తగాదాలే ఈ హత్యకు ప్రధాన కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story