భార్యతో గొడవ.. అడ్డొచ్చిన అత్తను కిరాతకంగా చంపిన అల్లుడు

by Naga Rani Yarlagadda |

భార్యతో గొడవ పడుతున్న అల్లుడిని ఆపేందుకు ప్రయత్నించిన అత్త.. అనూహ్యంగా హత్యకు గురైంది.

భార్యతో గొడవ.. అడ్డొచ్చిన అత్తను కిరాతకంగా చంపిన అల్లుడు
X

దిశ, వెబ్‌డెస్క్: మద్యం మత్తు మనిషిని పశువులా మార్చింది. సంసారంలో చెలరేగిన చిచ్చు చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న విషాద ఘటన నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలం కడమల గ్రామంలో చోటుచేసుకుంది. భార్యపై దాడి చేస్తుండగా అడ్డువచ్చిన అత్తను అల్లుడే కత్తితో పొడిచి కిరాతకంగా చంపాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. కడమల గ్రామానికి చెందిన సునీల్ అనే వ్యక్తికి కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి తన భార్యతో గొడవకు దిగాడు. మద్యం మత్తులో ఉన్న సునీల్ ఆవేశంతో ఊగిపోతూ భార్యపై విచక్షణారహితంగా దాడి చేయడం ప్రారంభించాడు. ఇది గమనించిన అత్త కళావతి (సునీల్ అత్త) గొడవను ఆపడానికి ప్రయత్నించింది. తన కూతురిని కొట్టవద్దని, శాంతించాలని సునీల్‌ను బతిమాలింది. అప్పటికే ఫుల్లుగా మద్యం సేవించి ఉన్న సునీల్.. అత్తపై కత్తిపై కత్తితో విచక్షణారహితంగా దాడిచేశాడు. శరీరంలోని కీలక భాగాల్లో కత్తిపోట్లు తగలడంతో కళావతి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ, గాయాలు బలంగా ఉండటంతో కళావతి ప్రాణాలు కోల్పోయింది. అత్తను చంపిన అనంతరం నిందితుడు సునీల్ అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు సునీల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story