జగద్గిరిగుట్టలో కత్తిపోట్లకు గురైన రషీద్ మృతి

by Malleboina Mahesh |

బుధవారం మేడ్చల్‌ జిల్లా జగద్గిరిగుట్టలో పట్టపగలు జరిగిన కత్తి దాడి ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బస్టాండ్‌ సమీపంలో రషీద్‌ (రోషన్‌) అనే యువకుడిపై బాల్‌శౌరెడ్డి, మరో వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

జగద్గిరిగుట్టలో కత్తిపోట్లకు గురైన రషీద్ మృతి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా దారుణ హత్యలు చోటు చేసుకుంటున్నాయి. పట్టపగలే.. నడిరోడ్డుపై కత్తులతో దాడులు చేస్తూ హతమారుస్తున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. విచ్చలవిడిగా రెచ్చిపోతున్న రౌడీ షీటర్లు, నిత్యం ఏదో ఒక ప్రాంతంలో దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బుధవారం మేడ్చల్‌ జిల్లా జగద్గిరిగుట్టలో పట్టపగలు జరిగిన కత్తి దాడి ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బస్టాండ్‌ సమీపంలో రషీద్‌ (రోషన్‌) అనే యువకుడిపై బాల్‌శౌరెడ్డి, మరో వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడిలో రషీద్‌కు తీవ్ర రక్తస్రావం కాగా, అక్కడున్నవారు భయంతో పరుగులు తీశారు. ఆర్థిక లావాదేవీలపై రషీద్‌-బాల్‌శౌరెడ్డి మధ్య వివాదం నెలకొన్నట్లు గుర్తించారు.

రౌడీ షీటర్ దాడిలో తీవ్రంగా గాయపడిన రషీద్‌‌ను గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల దర్యాప్తులో ఈ ఘర్షణ వెనుక ఓ ట్రాన్స్‌జెండర్‌తో ఉన్న డబ్బు పంచాయితీ కారణమని బయటపడింది. బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ట్రాన్స్‌జెండర్‌ ఫిర్యాదు చేసిన విషయం రషీద్ (రోషన్)కు కోపం తెప్పించగా, బాల్‌శౌరెడ్డినే దానికి కారణమని అనుమానించాడు. దీనిపై ఇద్దరి మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది. దీంతో బాల్‌శౌరెడ్డి చివరకు రోషన్‌పై కత్తి దాడి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Next Story