రాజకీయ నేతల హస్తమున్నట్లు ఆరోపణలు.. తనిఖీలకు సిద్ధమవుతున్న కమిటీ సభ్యులు

by Gantepaka Srikanth |

విజయ డెయిరీ పేరుతో మార్కెట్‌లో కల్తీ పాలు రాజ్యమేలుతున్నాయి. దీని వెనుక ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతల హస్తమున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రాజకీయ నేతల హస్తమున్నట్లు ఆరోపణలు.. తనిఖీలకు సిద్ధమవుతున్న కమిటీ సభ్యులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: విజయ డెయిరీ పేరుతో మార్కెట్‌లో కల్తీ పాలు రాజ్యమేలుతున్నాయి. దీని వెనుక ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతల హస్తమున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వీరికి ఆ సంస్థ ఉన్నతాధికారులు సహకరిస్తున్నారనే విమర్శలున్నాయి. తక్కువ ధరకే స్థానికంగా ఉండే ఏజెంట్లకు పాలను సరఫరా చేస్తుండటంతో పాలలో ఏ స్థాయిలో కల్తీ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ దందా పదేళ్ల నుంచే జరుగుతూనే ఉన్నదని కిరాణ దుకాణాల యాజమానులు చెబుతున్నారు. విజయ డెయిరీ లీటరు పాలు రూ. 58కు సరఫరా చేస్తుండగా, కల్తీ మాఫియా రూ. 50కే ఏజెంట్లకు అందజేస్తున్నది. దీంతో అసలైన విజయ డెయిరీ పాలు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతూ సంస్థ నష్టాలో బాటలో నడుస్తున్నది.

రైతు కమిషన్ ఫోకస్

గతంలో విజయ డెయిరీ రోజుకు 4.50 లక్షల లీడర్ల పాలు సేకరించేది. ప్రస్తుతం 3.50 లక్షల లీటర్లకు తగ్గింది. వారానికి రూ. 30 కోట్ల విలువైన పాలను విజయ డెయిరీ కొనుగోలు చేస్తున్నది. ఇలాంటి సంస్థ బ్రాండ్ పై ప్రైవేటు వ్యాపారులు కన్నేశారు. అదే పేరుతో పాల ప్యాకెట్లను తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. గతంలో విజయ డెయిరీ పేరుతో కల్తీ పాలు పట్టుబడినా.. అధికారులు ఎందుకు నియంత్రించలేక పోయారని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఏపీ నుంచి అక్రమ రవాణా అవుతున్నాయని ఉన్నతాధికారులు తప్పించుకుంటున్నారని పేర్కొంటున్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి వాటిపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం.. కల్తీ పాలను ఎందుకు నియంత్రించడం లేదని నిలదీస్తున్నారు. ఈ మాఫియాను కట్టడి చేయకపోతే మరింత ప్రమాదం ఉందని గ్రహించిన రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు కల్తీ నియంత్రణపై ఫోకస్ పెట్టారు. త్వరలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి.. ఉత్పత్తులు, తనిఖీలు చేసి ఎక్కడ కల్తీ జరుగుతుందో గుర్తించి సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

విజయ డెయిరీ పేరుతో..

కొన్ని సంస్థలు విజయ బ్రాండ్ వాడుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. అందులో కర్నూలు జిల్లా పరస్పర సహాయ సహకార సంఘం, వీఎన్ డెయిరీ, కృష్ణా జిల్లా పాల ఉత్పత్తి పరస్పర సహాయ సహకారం సంఘం, శ్రీసాయి దుర్గ ఎంటర్ ప్రైజెస్, నెల్లూరు జిల్లా పరస్పర సహాయ సహకార పాల ఉత్పత్తి యూనియన్, ఆల్ రిచ్ డెయిరీ ప్రైవేటు లిమిటెడ్, ఎన్ఎస్ఆర్ డెయిరీ వంటి సంస్థలు ఇందులో ఉన్నాయి. మరికొన్ని నార్మల్ డెయిరీ వంటి సంస్ధలు విజయ బ్రాండ్‌ను వాడుకుంటున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

కల్తీ పాలు తాగితే వ్యాధులే

నాణ్యతలేని, కల్తీ పాలు ప్రజలు తాగడంతో అనేక వ్యాధులకు గురయ్యే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిపై ప్రభుత్వం నిఘా పెట్టకపోతే మాఫియా ఆగడాలను అడ్డుకట్టవేయడం కష్టమౌతుందని పేర్కొంటున్నారు. కాగా, పాల కల్తీ మాఫియాపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. పాల ఉత్పత్తులు వ్యవసాయ శాఖ అనుబంధంగా ఉండటంతో రైతు కమిషన్ త్వరలో పాలు ఉత్పత్తి చేసే సంస్థల్లో తనిఖీలు చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

Next Story