మద్యం మత్తులో డ్రైవింగ్ వద్దని వారించిన పోలీసులు.. ఒంటికి నిప్పంటించుకుని ఆటో డ్రైవర్ సూసైడ్

by Kema Shiva Kumar |

రోడ్లపై వాహనదారుల భద్రత కోసం మద్యం సేవించి వాహనాలను నడపొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా.. చాలా మంది వాటిని పట్టించుకోవడం లేదు.

మద్యం మత్తులో డ్రైవింగ్ వద్దని వారించిన పోలీసులు.. ఒంటికి నిప్పంటించుకుని ఆటో డ్రైవర్ సూసైడ్
X

దిశ, సిటీ క్రైం: రోడ్లపై వాహనదారుల భద్రత కోసం మద్యం సేవించి వాహనాలను నడపొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా.. చాలా మంది వాటిని పట్టించుకోవడం లేదు. మద్యం మత్తులోనే ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా, మల్కాజిగిరి ట్రాఫిక్ పీఎస్ ఎదుట ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న వైనం కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జవహార్‌నగర్ ప్రాంతానికి చెందిన మీన్‌రెడ్డి వత్తిరీత్యా ఆటో‌డ్రైవర్. మంగళవారం మీన్‌రెడ్డి ఆటో‌లో వెళ్తుండగా మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు అతడికి డ్రంకన్ డ్రైవింగ్ పరీక్ష చేశారు. కాగా, మీన్‌రెడ్డికి బీఏసీ కౌంట్ 120 వచ్చింది. దీంతో పోలీసులు అతడు మద్యం మత్తులో ఉన్నాడు కాబట్టి ఎవరినైనా తీసుకుని రావాలని.. వారు కూడా మద్యం మత్తులో లేకపోతేనే ఆటోను ఇస్తామని చెప్పి ఆటోను స్టేషన్‌లోనే పెట్టారు. దీంతో మద్యం మత్తులో ఉన్న మీన్‌రెడ్డి మనస్తాపానికి గురై రోడ్డు మీదే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, నిబంధనల మేరకే పోలీసులు వ్యవహరించారని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్‌ను వదిలేసి ఉంటే రోడ్లపై మరికొందరికి ప్రాణ సంకటంగా మారేదని పోలీసులు వర్గాలు తెలిపాయి.

Next Story