- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ దొంగ ఎవరో కాదు ‘కొడుకే’.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు!
బయటి దొంగల భయం అనుకుంటే, కంచెయే చేను మేసిన చందంగా కన్న కొడుకే ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఘటన కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

దిశ, వెబ్‌డెస్క్: బయటి దొంగల భయం అనుకుంటే, కంచెయే చేను మేసిన చందంగా కన్న కొడుకే ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఘటన కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. తన తల్లి, చెల్లికి సంబంధించిన బంగారాన్ని దొంగిలించి స్నేహితులతో కలిసి జల్సాలు చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌కు చెందిన ఎండీ షరీఫ్ అనే యువకుడు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. జల్సాల కోసం డబ్బు అవసరం కావడంతో తన ఇంట్లోనే దొంగతనానికి స్కెచ్ వేశాడు. మార్చి 29న తన స్నేహితులతో కలిసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లి, చెల్లికి సంబంధించిన 20 తులాల బంగారాన్ని చోరీ చేశాడు. బంగారం కనిపించకపోవడంతో కంగారుపడిన బాధితులు మార్చి 31న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు..
కేసు నమోదు చేసుకున్న కంచన్‌బాగ్ పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా, దొంగ బయటి వ్యక్తి కాదని, ఇంట్లోనే ఉన్న షరీఫ్ అని తేలింది. నిందితుడు కేవలం ఒక్కసారి కాకుండా, ఏకంగా నాలుగు సార్లు దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో అంగీకరించాడు. దొంగిలించిన 20 తులాల బంగారంలో 7 తులాలను అప్పటికే అమ్మేసిన షరీఫ్, ఆ డబ్బుతో స్నేహితులతో కలిసి విలాసవంతమైన జీవితం గడిపాడు. మిగిలిన 13 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో షరీఫ్‌కు సహకరించిన అతని స్నేహితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.






