మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసం.. ‘QNET’ సంస్థపై పోలీసుల దాడులు

by Kema Shiva Kumar |

మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడుతున్న QNET సంస్థపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. హైదరాబాద్, ఏపీ, కర్ణాటకల్లో 25 బృందాలతో సోదాలు చేపట్టారు.

మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసం.. ‘QNET’ సంస్థపై పోలీసుల దాడులు
X

దిశ, వెబ్‌డెస్క్: మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో అమాయక ప్రజలను, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులను నిలువునా ముంచుతున్న QNET సంస్థపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్ (Hyderabad) కేంద్రంగా సాగుతున్న ఈ భారీ మోసపూరిత నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు పోలీసులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఈ మేరకు నగరంలో 25 పోలీస్ బృందాలు రంగంలోకి దిగి నగరంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. కేవలం తెలంగాణలోనే కాకుండా, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), కర్ణాటక (Karnataka)లోనూ ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

ఐటీ ఉద్యోగులే టార్గెట్..

అధిక లాభాలు, ఆకర్షణీయమైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు అంటూ QNET ప్రతినిధులు ప్రధానంగా ఐటీ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు. వారిని నమ్మించి, బ్యాంకులతో మాట్లాడి లోన్లు ఇప్పించి.. ఆ లోన్ మొత్తాన్ని క్యూనెట్‌లో పెట్టుబడిగా పెట్టించి నిందితులు బురిడీ కొట్టిస్తున్నారు. ఈ మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న 20 మంది కీలక నిందితులను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అయితే బంజారాహిల్స్, మధురానగర్, మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్లలో నమోదైన క్యూనెట్ కేసుల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న అధికారులు, ఆ కేసులన్నింటినీ సీసీఎస్ (CCS) కు బదిలీ చేశారు.

గుట్టుచప్పుడు కాకుండా దందా..

పెట్టుబడి పెడితే చాలు లక్షలు వస్తాయంటూ తప్పుడు ప్రచారంతో ఐటీ ఉద్యోగులను ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. దీంతో మోసపోయిన బాధితులు వరుసగా ఫిర్యాదులు చేయడంతో పోలీసులు ఈ నెట్‌వర్క్‌పై నిఘా పెట్టి అసలు బాగోతాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Next Story