ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. కరడుగట్టిన ఇద్దరు దోపిడీ దొంగలు అరెస్ట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-16 07:36:14  IST  )

చందానగర్‌ (Chandanagar)లోని ఖజానా జ్యువెలర్స్‌ (Khazana Jewelers) దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు.

ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. కరడుగట్టిన ఇద్దరు దోపిడీ దొంగలు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: చందానగర్‌ (Chandanagar)లోని ఖజానా జ్యువెలర్స్‌ (Khazana Jewelers)‌ దోపిడీ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. నిందితులతో పాటు నాటు తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఇవాళ మీడియా ఎదుట నిందితులను హాజరుపరిచారు. అనంతరం డీసీపీ వినీత్ కుమార్ మాట్లాడుతూ.. ఆగస్టు 12న ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయుధాలతో ముసుగు ధరించి చందనగర్‌లోని ఖజానా జ్యూయలర్స్‌లోకి ప్రవేశించారని తెలిపారు. డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్‌పై కాల్పులు జరపడంతో అతడి ఎడమ మోకాలికి గాయమైందని, అనంతరం సుమారు 10 కిలోల వెండి వస్తువులు, బంగారు పూత పూసిన వెండితో సహా దుండగులు అక్కడి నుంచి పరారయ్యారని పేర్కొన్నారు. ఈ మేరకు జరిగిన ఘటనపై చందనగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో కేసు నమోదు కాగా.. తాము వెంటనే దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు. కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి సుమారు 900 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. విచారణలో భాగంగా మొత్తం ఏడుగురు నిందితులను గుర్తించామని అన్నారు. అరెస్టు అయిన వారిలో బిహార్‌ రాష్ట్రంలోని సరన్ జిల్లాకు శివాన్ గ్యాంగ్‌కు చెందిన ఆశిష్ కుమార్ సింగ్ (22), దీపక్ కుమార్ సాహు (22) ఉన్నారని డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు.

బిహార్‌కు చెందిన ఈ దోపిడీ గ్యాంగ్ హైదరాబాద్‌లోని బంగారం షాపుల్లో దోపిడీకి ఆయుధాలతో పథకం రచించారని డీసీపీ వినీత్ కుమార్ వెల్లడించారు. అందుకు నిందితుడు దీపక్ కుమార్ సాహు హైదరాబాద్‌లోని ఓ వెల్డింగ్ కార్మికుడి సాయంతో 31 జులైన జీడిమెట్లలోని అస్బెస్టాస్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారని తెలిపారు. అనంతరం రెండు సెకండ్‌ హ్యాండ్ బైక్‌లను సమకూర్చుకున్నారని.. ముందు చందనగర్‌లోని ఖాజానా షోరూమ్‌ ఎదుట రెక్కీ నిర్వహించి పక్కాగా దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. నిందితుడు ఆశిష్ కుమార్ సింగ్‌ను మహారాష్ట్రలో అరెస్టు చేశామని.. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో నిందితుడు దీపక్ కుమార్ సాహును కూడా అదుపులోకి తీసుకున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో జ్యువెలరీ షాపులకు డీసీపీ వినీత్ కుమార్ కీలక సూచన చేశారు. షాపు తెరిచిన సమయంలో స్టాఫ్‌తో పాటు యజమానులు తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ఇంట్రూషన్ అలారం ప్యానెల్‌ను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. వాటిని సమీప పోలీస్ స్టేషన్లకు లింక్ చేయాలన్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ఎస్‌వోటీతో పాటు సీసీఎస్, లా అండ్ ఆర్డర్ పోలీసులు అవిశ్రాంతంగా శ్రమించారని డీసీపీ వినీత్ కుమార్ ప్రశంసించారు.

Next Story