- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాలమూరు నిర్వాసితుల పరిహారానికి కన్నం: అక్షరాలా 250 కోట్లు.. 2500 మంది రైతులు
నమ్మి డబ్బులు దాచుకున్న అమాయక రైతులను నిలువునా ముంచేసిన ఓ భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: నమ్మి డబ్బులు దాచుకున్న అమాయక రైతులను నిలువునా ముంచేసిన ఓ భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని కుషాయిగూడ కేంద్రంగా నడుస్తున్న 'ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్' సంస్థ తమను మోసం చేసిందంటూ నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన వందలాది మంది రైతులు రోడ్డెక్కారు. మంగళవారం కుషాయిగూడలోని ఫైనాన్స్ కంపెనీ, యజమాని ధనుంజయ్ గుప్తా నివాసం ఎదుట రైతులు భారీ ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే.. అధిక వడ్డీ ఆశ చూపి ఈ మోసానికి తెరలేపారు. నెలకు రెండు రూపాయల వడ్డీ చెల్లిస్తామని నమ్మబలికి, ఒక్కో రైతు నుంచి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశారు. ఇలా సుమారు 25 గ్రామాలలోని 2500 మంది రైతుల నుండి దాదాపు రూ.250 కోట్లు సేకరించి, ఇప్పుడు అసలు, వడ్డీ చెల్లించకుండా వ్యాపారి ధనుంజయ్ గుప్తా మొహం చాటేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్వాసితుల కన్నీరు..
ఈ మోసంలో బాధితులంతా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన వారే కావడం గమనార్హం. ప్రభుత్వం తమకు ఇచ్చిన పరిహారం సొమ్మును భవిష్యత్తు అవసరాల కోసం ఈ ఫైనాన్స్ సంస్థలో దాచుకోగా, ఇప్పుడు ఆ డబ్బు పోవడంతో తమ పరిస్థితి ఏమిటని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. రైతుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు ఇప్పటికే సదరు ఫైనాన్స్ సంస్థ కార్యాలయాన్ని, దానికి సంబంధించిన ఆస్తులను సీజ్ చేశారు. అయితే, తమకు ఇంకా న్యాయం జరగలేదని, తమ డబ్బు తమకు దక్కే వరకు పోరాటం ఆపబోమని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ధనుంజయ్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.






