ఆరోగ్యశ్రీ పేరుతో ఆన్‌లైన్ మోసాలు..అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుడి అరెస్ట్

by Chintha Aamani |

ఆరోగ్యశ్రీ పేరుతో ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుడిని అరెస్టు చేసినట్లు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

ఆరోగ్యశ్రీ పేరుతో ఆన్‌లైన్ మోసాలు..అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుడి అరెస్ట్
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : ఆరోగ్యశ్రీ పేరుతో ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుడిని అరెస్టు చేసినట్లు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా జమ్మలమడుగు కు చెందిన ముల్లుంటి సలీం మాలిక్ అనే వ్యక్తి ఢిల్లీకి చెందిన సత్యం తో కలిసి ఈజీ మనీ కి అలవాటు పడి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. సలీం మాలిక్ హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుండి ఆరోగ్యశ్రీ డబ్బులు వచ్చాయని బాధితులకు ఫోన్ ద్వారా తెలిపి, ఢిల్లీలో ఉన్న సత్యంకు కాన్ఫరెన్స్ కాల్ కలపగా అప్పటికే ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా షాపింగ్ చేసిన లింకులు సత్యం బాధితులకు పంపేవాడు.

నమ్మి ఆ లింకును క్లిక్ చేయగానే బాధితుల ఖాతాలో నుండి డబ్బులు కట్ అయ్యేవి. దీనికి సహాయపడిన సలీం మాలిక్ సత్యం కొంత డబ్బులు పంపించేవాడు. జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన రాజిరెడ్డి వీరి ద్వారా రూ.పదివేలు మోసపోయి ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఆదేశాల మేరకు సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి సూచనలతో కేసు నమోదు చేసిన ముస్తాబాద్ ఎస్సై గణేష్ దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా సైబర్ టీం ఆర్ఎస్ఐ జునైద్, సిబ్బంది కిట్టు, గంగారెడ్డి, ముస్తాబాద్ కానిస్టేబుల్ కాసిం ప్రత్యేక టీమ్ గా ఏర్పడి సాంకేతికత ఆధారంగా హైదరాబాద్ లో బుధవారం నిందితుడు సలీం మాలిక్ ను అరెస్ట్ చేసినట్లు, ఈ కేసులో మరో నిందితుడు సత్యం పరారీలో ఉన్నాడని, అతి త్వరలో అతన్ని కూడా పట్టుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. నిందితులపై తెలుగు రాష్ట్రాల్లో 79 ఫిర్యాదులు ఉన్నాయని, సుమారు రూ.60 లక్షలకు పైగా ఆన్లైన్ మోసాలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు.

Next Story