- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచిర్యాల జిల్లాలో ప్రకృతి ప్రకోపం.. రేకుల షెడ్డు కూలి నలుగురు రైతుల మృతి
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో అర్ధరాత్రి ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి. ధాన్యం కాపాడుకునే క్రమంలో రేకుల షెడ్డు కుప్పకూలి నలుగురు రైతులు మృతి చెందారు

దిశ, వెబ్‌డెస్క్: హఠాత్తుగా వీచిన ఈదురుగాలులు, భారీ వర్షం అన్నదాతల జీవితాల్లో తీరని శోకాన్ని నింపాయి. ఈదురుగాలుల ధాటికి రేకుల షెడ్డు కుప్పకూలిన ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన మంచిర్యాల (Mancherial) జిల్లా లక్షెట్టిపేట (Lakshmepet) మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది.
ధాన్యం కాపాడుకోబోయి.. విగతజీవులై..
కొనుగోలు కేంద్రాల వద్ద తాము పండించిన ధాన్యం రాశులపై రైతులు కాపలాగా ఉన్నారు. అర్ధరాత్రి ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో, ధాన్యం తడవకుండా కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో గాలి వేగానికి అక్కడే ఉన్న రేకుల షెడ్డు ఒక్కసారిగా కూలి రైతులపై పడింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్, అభిరామ్, లచ్చన్న, నాగరాజు అనే నలుగురు రైతులు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురు రైతులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం.
నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
భారీ ఈదురుగాలుల ప్రభావంతో లక్షెట్టిపేట పరిసర ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. అనేక చోట్ల భారీ వృక్షాలు విరిగి రోడ్లపై పడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో మండల వ్యాప్తంగా అంధకారం నెలకొంది. రోడ్లపై చెట్లు పడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే, ప్రభుత్వం తక్షణమే స్పందించి మృతి చెందిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని, పంట నష్టపోయిన వారికి పరిహారం అందించాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు.






