రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసు.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-11 05:57:51  IST  )

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సతీమణి తనూజ హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు.

రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసు.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి
X

దిశ, వెబ్‌డెస్క్: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ (Tanuja) హత్య కేసు దర్యాప్తులో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఈ దారుణ హత్య వెనుక అంతరాష్ట్ర నేరగాళ్ల హస్తం ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఈ నేరం వెనుక ఉన్న నేపాల్ గ్యాంగ్ ‘సాహు గ్యాంగ్’ గుట్టును పోలీసులు రట్టు చేశారు.

ఢిల్లీ జైలు నుంచే ప్లాన్..

అయితే, తనూజ హత్యకు సంబంధించిన కుట్ర ఢిల్లీ (Delhi) జైలులో మొదలైనట్లు విచారణలో తేలింది. జైలు నుంచే ముఠా సభ్యులు ఈ దారుణానికి స్కెచ్ వేశారు. ముఖ్యంగా ప్రధాన నిందితురాలు కల్పన, ముంబై, నేపాల్, పాట్నాకు చెందిన నేరగాళ్లను ఏకం చేసి ఈ దోపిడీకి వ్యూహం రచించింది. అందరినీ ఒకే తాటిపైకి తెచ్చి, రిటైర్డ్ అధికారి ఇంట్లో భారీగా నగదు, బంగారం ఉంటుందని నమ్మించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తనూజను హత్య చేసిన అనంతరం నిందితులు ఇంట్లోని విలువైన బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఈ చోరీ సొత్తును వారు ముంబైకి తరలించి అక్కడ దాచినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు పరారయ్యేందుకు కూడా ముందస్తుగా రైలు, బస్సు మార్గాలను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.

ఇద్దరి అరెస్ట్.. కల్పన కోసం వేట

ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారిగా భావిస్తున్న కల్పన ప్రస్తుతం పరారీలో ఉంది. ఆమె పూణె (Pune)లో తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో, ప్రత్యేక పోలీసు బృందాలు మహారాష్ట్రకు చేరుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. నేపాలీ గ్యాంగ్ ప్రమేయం ఉండటంతో సరిహద్దు ప్రాంతాల్లో కూడా పోలీసులు నిఘా పెంచారు. రిటైర్డ్ అధికారి ఇంట్లోనే ఇలాంటి ఘటన జరగడం రాష్ట్ర పోలీసు వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

Next Story