- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ సర్పంచ్ మిస్సింగ్ కేసు విషాదాంతం.. 18 మంది పిల్లల తండ్రి దారుణ హత్య
నాలుగు రోజులక్రితం మిస్సైన మాజీ సర్పంచ్ కేసు విషాదాంతమైంది. 18 మంది పిల్లలకు తండ్రైన అతడిని హత్యచేసినట్లు పోలీసులు గుర్తించారు.

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్‌గఢ్ జిల్లాలో కలకలం రేపిన మాజీ సర్పంచ్ మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన మిసిర్పూర్ ముస్తార్కా గ్రామానికి చెందిన మాజీ గ్రామ ప్రధాన్ గుల్హాసన్ అలియాస్ మున్నా (50) మృతదేహం ఆదివారం సుమేర్‌పూర్ సమీపంలో ఒక సంచిలో కుక్కిన స్థితిలో లభ్యమైంది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసులో ఒక మహిళతో పాటు ఆమె సోదరుడు, మరో వ్యక్తిని నిందితులుగా గుర్తించారు.
కాల్ డేటా ఆధారంగా గుట్టు రట్టు
మార్చి 18న మోటార్ సైకిల్‌పై మార్కెట్‌కు వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన మున్నా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మున్నా కాల్ డేటాను విశ్లేషించగా, ఒక మహిళతో అతను చివరిసారిగా మాట్లాడినట్లు తేలింది. మరోవైపు, అతని బైక్, హెల్మెట్ మౌయిమా కల్యాణ్‌పూర్ సమీపంలో లభించడంతో అనుమానాలు బలపడ్డాయి. సదరు మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
హత్యకు పక్కా స్కెచ్
పోలీసుల విచారణలో నిందితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండేళ్లుగా మున్నాతో ఆమెకు సంబంధం ఉంది. ఆమె భర్త పని నిమిత్తం బయట ఉండటంతో వీరి పరిచయం ఏర్పడింది. అయితే, ఇటీవల ఆమె ఈ బంధాన్ని వదులుకోవాలని భావించినప్పటికీ, మున్నా అందుకు అంగీకరించలేదు. దీంతో విసిగిపోయిన ఆమె తన సోదరుడు అతుల్ గౌతమ్‌కు విషయం చెప్పింది. పథకం ప్రకారం మున్నాను తన పుట్టింటికి పిలిపించింది. అతను నిద్రపోతున్న సమయంలో అతుల్, అతని స్నేహితుడు అరుణ్ గౌతమ్ కలిసి ఇనుప రాడ్‌తో తలపై బాది అక్కడికక్కడే హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని సంచిలో వేసి కాలువలో పడేశారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర కొట్టుకుపోయిన మృతదేహాన్ని పోలీసులు ఆదివారం వెలికితీశారు.
వ్యక్తిగత జీవితంపై చర్చ
మున్నా వ్యక్తిగత జీవితం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతనికి ఇద్దరు భార్యలు, మొత్తం 18 మంది పిల్లలు (తొమ్మిది మంది కుమారులు, తొమ్మిది మంది కుమార్తెలు) ఉన్నారు. ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పటికీ, కేవలం ఒక కుమార్తెకు మాత్రమే వివాహం జరిగింది. ఇద్దరు భార్యలకు వేర్వేరు ఇళ్లు కట్టించిన మున్నా.. మరికొందరు మహిళలతో కూడా టచ్‌లో ఉన్నట్లు అతని ఫోన్ రికార్డులు సూచిస్తున్నాయి. పోస్టుమార్టం అనంతరం మున్నా భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుతం మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.






