గ్రానైట్ క్వారీలో వలస కూలీ అనుమానాస్పద మృతి

by Bhanu |

మండలంలోని నందగిరి గ్రామంలో గల మైత్రి గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రానైట్ క్వారీలో పనిచేస్తున్న వలస కూలి అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డాడు.

గ్రానైట్ క్వారీలో వలస కూలీ అనుమానాస్పద మృతి
X

దిశ, పెగడపల్లి: మండలంలోని నందగిరి గ్రామంలో గల మైత్రి గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రానైట్ క్వారీలో పనిచేస్తున్న వలస కూలి అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డాడు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సాని అనే వలస కూలి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందినట్లు మృతుడి సోదరుడు సోమా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామాకై జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా మృతుడు సాని కరెంట్ షాక్ తగలడంతోనే మృతి చెందినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతుంది. పోలీసులకు అందిన ఫిర్యాదుకు స్థానికంగా ఉండే కార్మికులు మాట్లాడే దానికి పొంతన లేకపోవడం అనుమానాలకు తావిస్తుంది. అయితే మృతుడి పోస్టుమార్టం అనంతరం పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.



వలస కూలీలకు రక్షణ కరువు.?

మంగళ వారం రోజున వలస కూలి మృతి చెందిన సంఘటన తో అసలు వలస కూలీల రక్షణ కోసం ఆయా యాజమాన్యాలు తీసుకుంటున్న రక్షణ చర్యలపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో వెల్గటూర్ మండలంలో గ్రానైట్ రాయి మీద పడి ఓ వలస కూలి మృతి చెందగా కొద్ది నెలల క్రితం కొండగట్టు ముత్యంపేట సమీపంలో గల గ్రానైట్ క్వారీలో ముందస్తు హెచ్చరికలు లేకుండా చేసిన బ్లాస్టింగ్ కారణంగా స్థానికుడు తీవ్రంగా గాయపడి మరణించాడు. ఇలాంటి ఘటనలతో జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న గ్రానైట్ క్వారీలలో కార్మికుల రక్షణ తీసుకుంటున్న చర్యలు కేవలం పేపర్లకే పరిమితమైనట్లు ఆరోపణలు ఉన్నాయి.

Next Story