చిట్‌‌ఫండ్ పేరుతో భారీ మోసం.. రూ. 2 కోట్లతో దంపతులు పరార్!

by Kema Shiva Kumar |

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు రూ.2 కోట్ల చిట్‌ఫండ్ మోసం వెలుగులోకి వచ్చింది.

చిట్‌‌ఫండ్ పేరుతో భారీ మోసం.. రూ. 2 కోట్లతో దంపతులు పరార్!
X

దిశ, వెబ్‌డెస్క్: నమ్మకమే పెట్టుబడిగా, చిట్‌ఫండ్ (Chit Fund) పేరుతో అమాయక ప్రజలను బురిడీ కొట్టించిన మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పదేళ్లుగా నమ్మకంగా చిట్టీలు నిర్వహిస్తూ, తీరా డబ్బులు చెల్లించాల్సిన సమయంలో ఘరానా కపుల్స్ చేతులెత్తేసి ఉడాయించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఇందులో సుమారు రూ.2 కోట్ల మేర స్కామ్ జరిగినట్లుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. మీర్‌పేట్ (Meerpet) పోలీస్ స్టేషన్ పరిధిలో సురేష్ (Suresh), అతడి భార్య గత పదేళ్లుగా ‘వెంకటసాయి చిట్‌ఫండ్స్’ (Venkata Sai Chit Funds) పేరుతో చిట్టీలు నిర్వహిస్తున్నారు. పదేళ్లుగా వ్యాపారం చేస్తుండటంతో స్థానికులు వారిని నమ్మి భారీగా పెట్టుబడులు పెట్టారు. సుమారు 25 మందికి పైగా బాధితులు ఆ దంపతుల వద్ద చిట్టీలు వేశారు. ఒక్కొక్కరు రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నగదును సురేష్‌కు అప్పగించారు.

వెలుగులోకి మోసం ఇలా..

చిట్టీల గడువు ముగిసిన తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు కోరగా.. సురేష్ దంపతులు ముఖం చాటేశారు. అడిగినప్పుడల్లా చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇచ్చి కాలయాపన చేస్తూ వచ్చారు. సురేష్ ఇచ్చిన చెక్కులు బ్యాంకులో బౌన్స్ అవ్వడంతో బాధితులకు అనుమానం వచ్చింది. తమ కష్టార్జితం తిరిగి రాదని గ్రహించిన బాధితులు, సురేష్ ఇంటి ఎదుట నిరసన చేపట్టారు. పదేళ్ల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని తమను నిలువునా ముంచారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బాధితులు మీర్‌పేట్ పోలీసులను ఆశ్రయించారు. సుమారు రూ.2 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ఎక్కడ ఉన్నారనే కోణంలో గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story