నగరంలో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన టింబర్ డిపో, కోట్లలో ఆస్తి నష్టం!

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-05 03:23:35  IST  )

మహానగర పరిధిలో వరుస అగ్ని ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. తాజాగా మైలార్‌దేవపల్లి-కాటేదాన్ ప్రాంతంలో ఉన్న ఓ టింబర్ డిపో కాలిబూడిదైంది.

నగరంలో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన టింబర్ డిపో, కోట్లలో ఆస్తి నష్టం!
X

దిశ, వెబ్‌డెస్క్: నగర శివారులోని మైలార్‌దేవపల్లి-కాటేదాన్ ప్రాంతంలో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక సుమిత్ టింబర్ డిపో (Sumit Timber Depot)తో పాటు దానికి ఆనుకుని ఉన్న బీడీ ప్లైవుడ్ (Beedi plywood) గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీ నష్టం వాటిల్లింది. టింబర్ డిపోలో నిల్వ ఉంచిన భారీ కలప దుంగలు, కట్టెలకు మంటలు అంటుకోవడంతో అవి క్షణాల్లో గోడౌన్ అంతటా వ్యాపించాయి. దీంతో ఆ పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా సిబ్బంది గంటల పాటు శ్రమించి అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

అయితే, గోడౌన్‌లోని విలువైన ప్లైవుడ్, కలప పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దీనివల్ల సుమారు రూ.కోటి వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని యజమానులు, అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story