67 మంది యువతులకు వలపు వల.. నకిలీ CISF అధికారి గుట్టురట్టు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-14 08:55:27  IST  )

శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ సీఐఎస్‌ఎఫ్ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

67 మంది యువతులకు వలపు వల..  నకిలీ CISF అధికారి గుట్టురట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ నకిలీ సీఐఎస్‌ఎఫ్ (CISF) అధికారి గుట్టు రట్టయింది. మిలటరీ యూనిఫాం ధరించి ఎయిర్‌పోర్ట్‌లో హల్‌చల్ చేస్తున్న ఒక వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను చెప్పిన నిజాలు విని అధికారులు నిర్ఘాంతపోయారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి, తాను సీఐఎస్‌ఎఫ్ అధికారిగా పనిచేస్తున్నానని అందరినీ నమ్మిస్తున్నాడు. అందుకోసం ఖరీదైన యూనిఫాం, నకిలీ ఐడీ కార్డులను కూడా సిద్ధం చేసుకున్నాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అదే యూనిఫాంలో హడావిడి చేస్తూ అధికారుల కంటపడ్డాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన సిబ్బంది విచారించగా, అతను నకిలీ అధికారి అని తేలింది.

67 మంది మహిళలకు వలపు వల..

బాలకృష్ణ నేర చరిత్రను పరిశీలించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో తన పోలీస్ యూనిఫాం ఫోటోలను అప్‌లోడ్ చేసి యువతులకు వల వేయడంలో ఇతను సిద్ధహస్తుడు. ఇప్పటి వరకు సుమారు 67 మంది మహిళలను పెళ్లి పేరుతో మోసం చేసినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. అమాయక మహిళలను నమ్మించి వారి నుంచి భారీగా నగదు, నగలు వసూలు చేసి ఎవరికీ కనిపించకుండా పోవడం బాలకృష్ణ స్పెషాలిటీ. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతని వద్ద ఉన్న యూనిఫాం, నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ మ్యాట్రిమోనీ సైట్లలో ఇలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వ అధికారులు అని చెప్పేవారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని పోలీసులు హెచ్చరించారు.

Next Story