లాటరీ తగిలిందంటూ... రూ.1.78 లక్షలు కుచ్చు టోపీ

by Disha Web Desk 1 |
లాటరీ తగిలిందంటూ... రూ.1.78 లక్షలు కుచ్చు టోపీ
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. లోన్, లాటరీ పేరిట తగిలిందంటూ అమాయకుల అత్యాశను ఆసరాగా చేసుకుని లక్షలు కొట్టేస్తున్నారు. అలాంటివే సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఐదు ఘటనలు చోటుచేసుకున్నాయి. సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాధితుడికి గుర్తుతెలియని సైబర్ నేరగాడు ఫోన్ చేసి మీషో నుంచి మాట్లాడుతున్నాం.. మీకు రూ.12 లక్షల లాటరీ తగిలిందంటూ నమ్మబలికాడు.

ప్రాసెసింగ్ చార్జ్, జీఎస్టీ కట్టాలని చెప్పగానే.. బాధితుడు సైబర్ నేరగాడు పంపించిన ఫోన్ నెంబర్ కు గూగుల్ పే, ఫోన్ పే నుంచి రూ.1,78,750 పంపించాడు. తీరా చూస్తే.. ఆ కాల్ చేసిన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు జాతీయ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో బాధితుడికి సైబర్ నేరస్థుడు లోన్ యాప్ లింక్ పంపించాడు.

లింక్ ఓపెన్ చేసిన బాధితుడు వివరాలు నమోదు చేసిన అనంతరం లోన్ మంజూరు అవుతోందని, ప్రాసెసింగ్ చార్జ్, జీఎస్టీ కట్టాలంటూ.. సైబర్ నేరస్థుడు చెప్పిన విధంగా ఫోన్ ఫే నుంచి సదరు బాధితుడు రూ.18,499 పంపించాడు. అదేవిధంగారాయపోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగం కోసం ఓ యాప్ లో వివరాలు నమోదు చేయగా సైబర్ నేరస్థుడు బ్లాక్ మెయిల్ చేసి బాధితుడి నుండి రూ.8,950 కాజేశాడు.

భూంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సామాజిక మాద్యమంలో సౌండ్ బ్యాక్స్ లను అర్డర్ చేయగా.. డెలివరీ కావాలంటే అడ్వాన్స్ కట్టాలని సైబర్ నేరస్తుడు చెప్పిన విధంగా బాధితుడు రూ.18,800 పంపించాడు. ఆయా ఘటనల్లో బాధితులు జాతీయ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సైబర్ నేరస్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ శ్వేత సూచించారు.


Next Story

Most Viewed