- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండగట్టు అగ్ని ప్రమాదం.. జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు వద్ద ఇటీవల జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని (Rama Rao Immaneni) జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కి ఫిర్యాదు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు వద్ద ఇటీవల జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని (Rama Rao Immaneni) జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కి ఫిర్యాదు చేశారు. ఈ ప్రమాదం వెనుక పూర్తి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఉందని, అగ్నిమాపక శాఖ తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మొదటి దుకాణంలో మంటలు అంటుకున్న వెంటనే బాధితులు 108కు సమాచారం ఇచ్చినా.. జగిత్యాల నుంచి బయలుదేరిన ఫైరింజిన్ మధ్యలోనే ఆగిపోయింది. అంతేకాక, మరొక ఫైర్ ఇంజిన్ మెషినరీ మొరాయించింది పిటిషన్‌లో వెల్లడించారు. ఫలితంగా కోరుట్ల, కరీంనగర్ నుంచి ఫైరింజిన్లు వచ్చినప్పటికీ అగ్నిమాపక శాఖ చూపిన నిర్లక్ష్యం ప్రమాద తీవ్రత పెరిగి, నష్టం భారీగా సంభవించిందని ఆరోపించారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వ వైఫల్యం కారణంగా నష్టపోయిన బాధితులందరికీ ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. అదే విధంగా, బాధితులకు తక్షణ సహాయం అందేలా తాత్కాలిక పరిహారం ఇవ్వాలంటూ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ (Satya Prasad)ను ఆదేశించాలని ఆయన NHRCని అభ్యర్థించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే, అగ్నిమాపక శాఖను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ (Vikram Singh Maan)ను తక్షణమే జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు సమీపంలో ఫైర్ స్టేషన్, ఫైర్ ఇంజిన్, సిబ్బందిని కేటాయించాలని రామారావు ఇమ్మానేని ఎన్‌హెచ్ఆర్‌సీకి విజ్ఞప్తి చేశారు. కాగా, రామారావు వేసిన పిటిషన్‌ను జాతీయ మానవ హక్కుల కమిషన్ స్వీకరించింది. కొండగట్టు అగ్ని ప్రమాద ఫిర్యాదును 27572/IN/2025 నంబర్‌గా నమోదు చేసి కమిషన్ త్వరలోనే విచారణ చేపట్టనుంది.
కాగా, నవంబర్ 29న కొండగట్టు (Kondagattu) స్టేజీ వద్ద శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. స్థానిక అభయ హనుమాన్ విగ్రహం నుంచి కరీంనగర్ (Karimnagar)-జగిత్యాల (Jagityal) ప్రధాన రహదారి వరకు దాదాపు 32 బొమ్మల దుకాణాలకు నిప్పంటుకొని సామగ్రి కాలి బూడిదైంది. సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని వ్యాపారులు భారీ మొత్తంలో బొమ్మలు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. ఒక్కో దుకాణంలో రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విలువైన బొమ్మలున్నాయి. ఈ ప్రమాదంలో రూ.లక్షల్లోనే ఆస్తి నష్టం జరిగిందని, ప్రభుత్వమే తమను అన్ని విధాలుగా ఆదుకోవాలని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.






