రాక్షసిగా మారిన తల్లి.. పశువుగా మారిన రాజకీయ నేత: మైనర్‌కు లైంగిక వేధింపులు!

by Gantepaka Srikanth |

రాజకీయ పలుకుబడి, ఆర్థిక బలాన్ని అడ్డం పెట్టుకుని ఒక మైనర్ బాలిక జీవితాన్ని ఛిద్రం చేయడమే కాకుండా, లైంగిక వేధింపులకు గురిచేసిన సంచలన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వెలుగుచూసింది.

రాక్షసిగా మారిన తల్లి.. పశువుగా మారిన రాజకీయ నేత: మైనర్‌కు లైంగిక వేధింపులు!
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయ పలుకుబడి, ఆర్థిక బలాన్ని అడ్డం పెట్టుకుని ఒక మైనర్ బాలిక జీవితాన్ని ఛిద్రం చేయడమే కాకుండా, లైంగిక వేధింపులకు గురిచేసిన సంచలన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. జనసేన పార్టీకి చెందిన స్థానిక నాయకుడు తోట వెంకటరాజు అలియాస్ రాజు.. నరసాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ, పొలిటికల్ పరపతిని సంపాదించుకున్నాడు. ఇదే క్రమంలో నరసాపురానికి చెందిన ఒక మహిళతో అతనికి అక్రమ సంబంధం ఏర్పడింది. కాలక్రమేణా వెంకటరాజు ఆ మహిళ ఇంటిపై పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించాడు. సదరు మహిళకు ఒక మైనర్ కుమార్తె ఉంది. మహిళతో ఉన్న సంబంధం కాస్తా, ఆ నిరుపేద బాలికపై లైంగిక వేధింపుల వైపు దారితీయడంతో ఈ నేరపూరిత ఉదంతం మొదలైంది.

లొంగకపోతే చంపేస్తా..

"నాకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి.. పోలీస్ స్టేషన్లు, కోర్టులు నన్నేమీ చేయలేవు" అంటూ సదరు బాలికను భయభ్రాంతులకు గురిచేశాడు. తను చెప్పినట్లు వినకపోతే జీవితం నాశనం చేస్తానని, కుటుంబం మొత్తం ఊరిలో తలెత్తుకోకుండా చేస్తానని తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ కేసులో అత్యంత ఘోరమైన కోణం ఏమిటంటే, నిందితుడి ఆర్థిక బలానికి లొంగిపోయిన కన్నతల్లి.. సొంత కూతురిని రక్షించాల్సింది పోయి, వెంకటరాజుతో అక్రమ సంబంధం పెట్టుకోవాలంటూ బాలికపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. లొంగకపోతే ఇంట్లో వేధింపులకు గురిచేసేది. వెంకటరాజు నుంచి వస్తున్న లైంగిక ఒత్తిడి, తల్లి చేస్తున్న మానసిక వేధింపులను భరించలేకపోయిన ఆ మైనర్ బాలిక చివరకు తెగించింది. సమాజం ఏమనుకున్నా పర్వాలేదు, తనకు ప్రాణరక్షణ కావాలని భావించి ధైర్యంగా స్థానిక పోలీసులను ఆశ్రయించింది. తల్లి, జనసేన నేత వెంకటరాజులు కలిసి తన్ను మానసికంగా, శారీరకంగా ఎలా వేధిస్తున్నారో, లొంగకపోతే చంపేస్తామని ఎలా బెదిరిస్తున్నారో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియా ముందుకు వచ్చి కన్నీటిపర్యంతమవుతూ తన ఆవేదనను వెళ్లగక్కింది. రాజకీయ నాయకుడైన వెంకటరాజు నుంచి తనకు, తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని, తన తల్లిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంది.

లీగల్ యాక్షన్ & సెక్షన్లు..

ఈ వ్యవహారంలో ఒక మైనర్ బాలిక నేరుగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. నిందితుడి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌ను పక్కన పెట్టి, కేసు తీవ్రత దృష్ట్యా ఈ క్రింది సెక్షన్ల కింద కేసు నమోదు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. బాధితురాలు మైనర్ కావడం, లైంగిక వేధింపులు నిజమని ప్రాథమికంగా రుజువు కావడంతో నాన్-బెలెబుల్ పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు కానుంది. పోలీసులు బాలికకు రక్షణ కల్పించి, కౌన్సిలింగ్ నిమిత్తం పంపించారు. పరారీలో ఉన్న జనసేన నేత తోట వెంకటరాజుతో పాటు, అతనికి సహకరించిన తల్లి మోకా లక్ష్మిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. పొలిటికల్ పవర్‌తో మైనర్లపై ఇటువంటి దారుణాలకు ఒడిగడితే చట్టం ఎంత కఠినంగా ఉంటుందో చూపిస్తామని స్థానిక పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.

Next Story