హత్యకేసులో వ్యక్తికి జీవిత ఖైదు.. జరిమానా

by Bhanu |

హత్యకేసులో యువకుడికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ ఎల్బీనగర్​ ప్రిన్సిపల్ ​జిల్లా న్యాయస్థానం (పీడీజే కోర్టు) గురువారం తీర్పు వెలువరించింది.

హత్యకేసులో వ్యక్తికి జీవిత ఖైదు.. జరిమానా
X

దిశ, వనస్థలిపురం: హత్యకేసులో యువకుడికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ ఎల్బీనగర్​ ప్రిన్సిపల్ ​జిల్లా న్యాయస్థానం (పీడీజే కోర్టు) గురువారం తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్ ​కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్​ నారాయణపూర్​ మండలం లచ్చమ్మ గూడెం గ్రామానికి చెందిన మాదగాని రాజు (30) రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ ​మండలం, ఇంజాపూర్​ ఇందిరమ్మ కాలనీలోని తన మేనత్త ఇంట్లో ఉంటూ కారు డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. చిన్నతనంలోనే రాజు తల్లిదండ్రులు చనిపోగా, అక్క, తమ్ముడితో కలిసి ముగ్గురు మేనత్త జంగమ్మ వద్దే పెరిగారు.

పెద్దయ్యాక రాజు అక్క సునీతను మేనత్త కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశారు. తర్వాత రాజు, తమ్ముడు సుధాకర్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్లి ఇందిరమ్మ కాలనీలో 2014లో ఓ ప్లాటు కొని అక్కడే ఇల్లు కట్టుకున్నారు. రాజు ఇల్లు కట్టడం, కారు కొనుకోవడం వల్ల సుమారు రూ. 7 లక్షల అప్పు చేశాడు. అందులో మరో మేనత్త లక్ష్మమ్మ వద్ద రూ. 1లక్ష అప్పు చేశాడు. అలా ఆమె అప్పు ఇవ్వకుండా ఏండ్లు గడవడంతో ఆమె రాజును కనబడిన చోటల్లా తిడుతూ ఉండేది. 2024 ఫిబ్రవరి 7న రాజు యథావిధిగా కారును ఓలా , ఊబర్ ​కిరాయిలకు ఇంజాపూర్ ​గ్రామ పంచాయితీ ఆఫీసు దాటగానే మేనత్త లక్ష్మమ్మ కలిసి మళ్లీ తిట్టింది.

దీంతో ఆమెను ఇంటికి వెళ్లి సముదాయిద్దామని రాజు ఇంటికి వెళ్లాడు. కానీ ఆమె వినకుండా రాజును మళ్లీ బూతులు తిట్టడంతో ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో ఆమె ఫోన్ లో మాట్లాడుతూ ఆమె పెరట్లోకి వెళ్లింది. వెనకాల నుంచి తోసివేయగా ఆమె కింద పడగానే, పక్కన ఉన్న సిమెంట్ ఇటుకతో ఆమె తల, ముఖం , నుదురు పైన బలంగా దాడి చేయడంతో ఆమె చనిపోయింది. ఈ మేరకు వనస్థలిపురం పోలీసులు రాజుపై కేసు నమోదు చేసి ఛార్జిషీటు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్​ అతనిపై నేరం రుజువు చేయడంతో జీవిత ఖైదు, రూ. 1‌000 జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.

Next Story