పైసా ఆదాయం లేదు.. కానీ ముగ్గురు భార్యలు.. స్నేహితుడి సహకారంతో దర్జాగా కాపురం

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-07-25 12:12:30  IST  )

చేస్తున్న పనికి తగ్గ ఆదాయం లేదు.. కానీ ఇంట్లో ముగ్గురు భార్యలు. వారిని పోషించడానికే అష్టకష్టాలు పడుతున్న అతడికి బోనస్‌గా ముగ్గురు పెళ్లాల పోరు భరించలేనిదిగా మారింది.

పైసా ఆదాయం లేదు.. కానీ ముగ్గురు భార్యలు.. స్నేహితుడి సహకారంతో దర్జాగా కాపురం
X

దిశ, వెబ్‌డెస్క్ : చేస్తున్న పనికి తగ్గ ఆదాయం లేదు.. కానీ ఇంట్లో ముగ్గురు భార్యలు. వారిని పోషించడానికే అష్టకష్టాలు పడుతున్న అతడికి బోనస్‌గా ముగ్గురు పెళ్లాల పోరు భరించలేనిదిగా మారింది. ఈ సమయంలోనే జైలుకు వెళ్లిన అతడికి అక్కడ పరిచయమైన ఖైదీ సలహాతో బయటకు వచ్చాక హ్యాపీగా సంసారం చేస్తున్నాడు. కానీ ఇంతలోనే ఆ ఖైదీ ఫ్రెండ్ ఇచ్చిన సలహానే మళ్లీ అతడిని జైలు జీవితంలోకి నెట్టింది. సినిమా ట్విస్టులను తలపించే ఈ క్రైం స్టోరీకి కీసర పోలీసులు ముగింపు పలికారు. అసలేం జరిగిందంటే..

షేక్‌ మహబూబ్‌ అలం. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడకు చెందిన ఇతడికి ముగ్గురు భార్యలు. తను చేసే పనికి వారిని పోషించడం భారంగా మారింది. ఈ సమయంలోనే ఓ హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయ్యి చర్లపల్లి జైలుకు వెళ్లాడు. అక్కడ విజయవాడకు చెందిన కాంపల్లి తిరుపతి అనే ఖైదీ అతడికి పరిచయం అయ్యాయి. గంజాయి కేసులో పట్టుబడ్డ అతడితో షేక్‌ మహబూబ్‌ అలంకు మంచి స్నేహం ఏర్పడింది. దీంతో ఇద్దరి కుటుంబ విషయాలు, సాధక బాధలు చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే తన ఆర్థిక పరిస్థితుల గురించి, ముగ్గురు భార్యలు, పిల్లల పరిస్థితిని చెప్పుకోని షేక్‌ మహబూబ్‌ అలం బాధపడ్డాడు. అయితే ఈజీగా డబ్బు సంపాదించే వ్యాపారం చేయాలని తిరుపతి సలహా ఇచ్చాడు. ఆ వ్యాపారం ఎలా చేయాలి? ఎవరితో చేయించాలో క్షుణ్ణంగా వివరించాడు.

చర్లపల్లి జైలు నుంచి విడుదలైన షేక్‌ మహబూబ్‌ అలం స్నేహితుడు తిరుపతి సహకారంతో విజయవాడ నుంచి గంజాయిని తీసుకువచ్చి కీసర మండలంలో పలువురిని నియమించుకోని పరిసర ప్రాంతాల్లో విక్రయాలు ప్రారంభించాడు. కీసర మండలంలో మూడు నెలలుగా సాగుతున్న ఈ దందా గురించి ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎక్సైజ్ సీఐ జె.రవి, ఎస్సైలు నందిని, సంగీత సిబ్బంది కలిసి కీసర మండలం దమ్మాయిగూడలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దీంతో వారికి గంజాయిని విక్రయిస్తున్న నవాబుఖాన్‌ పట్టుబడ్డాడు. అతడి వద్ద 230 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇతడిపై జవహార్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లోనూ కేసు నమోదయింది.

గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతుందని ప్రశ్నించగా.. దమ్మాయిగూడకు చెందిన షేక్‌ మహబూబ్‌ అలం పేరు బయటపడింది. దీంతో ఎక్సైజ్‌ పోలీసులు షేక్‌ మహబూబ్‌ షేక్ అలం ఇంటిపై దాడి చేసి 6.420 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. షేక్‌ మమహబూబ్‌ అలంను అదుపులోకి తీసుకోవడంతో ఖైదీ ఫ్రెండ్ కాంపల్లి తిరుపతి బయటపడింది. తిరుపతి ఇచ్చిన సలహాతోనే తాను విజయవాడ నుంచి గంజాయిని తీసుకువచ్చి కీసర మండల పరిధిలో ఇతరుల చేత విక్రయాలు చేయిస్తున్నట్లు షేక్‌ మమహబూబ్‌ అలం పోలీసులకు వివరించాడు. దీంతో ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి, విజయవాడకు చెందిన కాంపల్లి తిరుపతిపై కూడా కేసు నమోదు చేసినట్టు ఘట్కేసర్ ఎక్సైజ్‌ సీఐ రవి తెలిపారు. పట్టబడిన గంజాయి విలువ రూ.3.50 లక్షలు ఉంటుందని చెప్పారు.

Next Story