వెలుగుమట్ల భూమి పట్టాల పేరుతో భారీ మోసం వెలుగులోకి..

by Bhoopathi Nagaiah |

పట్టాలతో కూడిన ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పలు గ్రామాల ప్రజలు శనివారం కొణిజర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు

వెలుగుమట్ల భూమి పట్టాల పేరుతో భారీ మోసం వెలుగులోకి..
X

దిశ, ఖమ్మం క్రైమ్/కొణిజర్ల/సత్తుపల్లి: పట్టాలతో కూడిన ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పలు గ్రామాల ప్రజలు శనివారం కొణిజర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.వెలుగుమట్ల ప్రభుత్వ భూముల్లో పట్టాలు ఇస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుంచి 40 వేల రూపాయలు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకుఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు కొనిజర్ల ఎస్సై జి.సూరజ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..

కొణిజర్ల మండలం, పెద్దమునగాల గ్రామానికి చెందిన పరికిపల్లి వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2021 నవంబర్ నుండి 2023 వరకు ఏన్కూర్‌కు చెందిన పొన్నబోయిన బేబీ, (గ్రామ దీపిక) కల్తీ రామచంద్రయ్య, UCCRI(ML) జిల్లా కార్యదర్శి తాళ్లూరు కృష్ణ, కొప్పెర వెంకన్న మా గ్రామం వచ్చారు. ఖమ్మం జిల్లా ఖానాపురం హవేలీ మండలంలోని వెలుగుమట్ల రెవెన్యూలో సర్వేనెంబర్ 147, 148, 149, లలో సుమారు 62 ఎకరాల భూదాన్ భూమి ఉన్నదని, దానిని ప్రభుత్వం ప్లాట్లు చేసి పేదలకు ఇచ్చేందుకు దరఖాస్తులు కోరినట్లు తెలిపారు. ఈ పనిని అధికారులు మాకు అప్పగించారని నమ్మించారు. కొత్త కలెక్టరేట్ దగ్గరలో ఉన్న మట్టి గుట్ట వద్ద ఇళ్ల ప్లాట్లు ఉన్నాయని, మీరు UCCRI(ML) సంస్థలో పేర్లు నమోదు చేసుకొని మీరు డబ్బులు కడితే, మీకు 100 గజాల స్థలానికి కలెక్టర్ ద్వారా పట్టాలిస్తారని నమ్మబలికారు.

వారి మాటలు నిజమేనని కొణిజర్ల గ్రామానికి చెందిన తలారి రామకృష్ణ, పిట్టల శ్రీను కూడా చెప్పడంతో గ్రామానికి చెందిన పరికిపల్లి వెంకటేశ్వర్లు, కోట బాలు, తేళ్లూరి ప్రసాద్, సుంకర రాధాకృష్ణ, పిట్టల అనూష, బండారు రమాదేవి, గార్లపాటి నిర్మల, కట్ల రాజమ్మ సహా మరో 30 మందికి పైగా రూ.40 వేల చొప్పున పొన్నబోయిన బేబీ, కల్తీ రామచంద్రయ్య, తాళ్లూరు కృష్ణ, కొప్పెర వెంకన్నలకు తలారి రామకృష్ణ, పిట్టల శ్రీను ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారని చెప్పారు. ఆ తర్వాత డబ్బులు చెల్లించిన వారందరిని వెలుగుమట్ల స్థలం వద్దకు తీసుకెళ్లి ఇదే మీ స్థలమని చెప్పారు. మేము వారి మాటలు నమ్మి మాతో పాటు కొణిజర్ల మండల చుట్టుపక్కల గ్రామాలైన చిన్నమునగాల, కొణిజర్ల, గోపవరం గ్రామాల ప్రజలు సైతం వారికి డబ్బులు కట్టారు. వెలుగుమట్ల వెళ్లి వారు చూపించిన స్థలంలో రేకుల షెడ్లు వేసుకొని పట్టాల కొరకు ఎదురు చూస్తున్నారు.

డబ్బులు కట్టించుకుని ఏళ్లు గడుస్తున్నా కానీ ఇంతవరకు ఇంటి స్థలం గానీ, తీసుకున్న డబ్బులు గానీ ఇవ్వలేదు. వీటిపై ఎన్నిసార్లు ప్రశ్నించినా రకరకాల సమాధానాలు చెబుతూ, దాటవేస్తూ బూతులు తిట్టారు. చివరికి బాధితులను బెదిరిస్తూ దిక్కున్న చోట చెప్పుకోమని తెగేసి చెప్పారు. దీంతో మోసపోయామని గ్రహించి శనివారం కొణిజర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జి.సూరజ్ తెలిపారు.

Next Story