దండకారణ్యంలో కాల్పుల మోత.. నలుగురు మావోయిస్టులు మృతి

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-16 13:25:31.0  )
దండకారణ్యంలో కాల్పుల మోత.. నలుగురు మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్/భద్రాచలం: ఛత్తీస్‌ఘడ్‌(Chhattisgarh)లో మరోసారి కాల్పుల మోత మోగింది. బీజాపూర్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల(Maoists)కు మధ్య భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఊసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్, మారేడు బాక అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సౌత్ బస్తర్ ఏరియాలో మావోయిస్టులు రహస్య సమావేశం ఏర్పాటు చేశారని వచ్చిన సమాచారంతో కోబ్రా, సీఆర్‌పీఎఫ్, ఎస్‌టీఎఫ్, డీఆర్‌జీ మూడు జిల్లాలకు చెందిన భద్రతా బలగాలు గురువారం ఉదయం నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలను చూసి మావోయిస్టులు కాల్పులు జరపడంతో, భద్రతా బలగాలు మావోయిస్టులను ముట్టడించాయి. భద్రతా బలగాలు జరిపిన కాల్పులలో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, రెండు ఆయుధాలు లభ్యమైనట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కాగా మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement

Next Story