బాత్రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చి.. అనంతరం పసికందుపై దారుణం

by Naga Rani Yarlagadda |

పురిటి నొప్పులతో బాత్రూమ్ లో బిడ్డకు జన్మనిచ్చిన ఓ యువతి.. ఆ పసికందును గొంతుకోసి చంపేసింది.

బాత్రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చి.. అనంతరం పసికందుపై దారుణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐఫోన్ల తయారీ సంస్థ 'ఫాక్స్‌కాన్' ఫ్యాక్టరీలో అత్యంత విషాదకరమైన సంఘటన వెలుగుచూసింది. తన పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతో ఒక యువతి, తాను జన్మనిచ్చిన పసికందును గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపేసింది. బెంగళూరులోని దేవనహళ్లిలో ఉన్న ఫాక్స్‌కాన్ యూనిట్‌లో రేణుక (19) అనే యువతి పనిచేస్తోంది. బుధవారం ఆమె విధుల్లో ఉండగా హఠాత్తుగా పురిటి నొప్పులు రావడంతో టాయిలెట్‌కు వెళ్లింది. అక్కడే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. పెళ్లి కాకముందే తల్లి కావడంతో సమాజం ఎక్కడ వెలివేస్తుందో, పరువు పోతుందో అని భయపడిన రేణుక.. కనికరం లేకుండా ఆ పసికందు గొంతు కోసి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని ఒక బ్యాగులో పెట్టి అక్కడే పారేసింది.

మరో ఉద్యోగి టాయిలెట్‌కు వెళ్లినప్పుడు అక్కడ రక్తపు మరకలు, శిశువు మృతదేహం ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. ఆ బాధితురాలు రేణుక అని తేలింది. ప్రస్తుతం ఆ యువతి అనారోగ్యంతో ఉండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కేవలం సమాజానికి భయపడి ఒక తల్లి తన బిడ్డను చంపడం స్థానికంగా కలకలం రేపింది.

Next Story