- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యంలోకి నీళ్లివ్వలేదని ఘాతుకం.. బాలుడిని తుపాకీతో కాల్చి చంపిన వైనం
మానవత్వం మంటగలిసేలా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: మద్యపానం అనర్థాలకు దారి తీస్తుందనే విషయం అక్షర సత్యమైంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి నీళ్లు తీసుకురావడానికి నిరాకరించాడనే కోపంతో తొమ్మిదేళ్ల చిన్నారిని కాల్చి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని కాస్‌గంజ్ (Kasganj) జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు సహావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాకుత్‌గంజ్ (Yakutganj) గ్రామంలో శుక్రవారం రాత్రి బారసాల వేడుక జరిగింది. ఈ వేడుకకు బాలుడి తండ్రి జస్‌వీర్ గోలా బంధువులు, గ్రామస్థులు హాజరయ్యారు. ఈ వేడుకలో నిందితుడు ధనేష్ యాదవ్ మద్యం సేవిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలుడిని తనకు నీళ్లు తీసుకురావాలని ధనేష్ కోరాడు. అయితే, ఆ చిన్నారి నీళ్లు తీసుకురావడానికి నిరాకరించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ధనేష్, మద్యం మత్తులో విచక్షణ మరిచి తన వద్ద ఉన్న తుపాకీతో బాలుడి కడుపులో కాల్చాడు.
చికిత్స పొందుతూ కన్నుమూత..
తుపాకీ శబ్దంతో వేడుకలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడిని వెంటనే కాస్‌గంజ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అలీగఢ్‌కు తరలించారు. అయితే, శనివారం చికిత్స పొందుతూ ఆ చిన్నారి ప్రాణాలు విడిచినట్లు అధికారులు ధృవీకరించారు. ఘటన జరిగిన వెంటనే నిందితుడు ధనేష్ యాదవ్ (Dhanesh Yadav) అక్కడి నుంచి పరారయ్యాడు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. శనివారం ఖితౌలీ కాలువ వంతెన సమీపంలో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గోవింద్ వల్లభ్ శర్మ తెలిపారు.






