'సరిహద్దులు' దాటిన గంజాయి.. ఒడిశాలో కొనుడు.. కరీంనగర్ పరిసరాల్లో అమ్ముడు

by Bhanu |

జల్సాలకు అలవాటుపడి మత్తులో కొట్టుమిట్టాడుతున్న ముగ్గురు యువకులు గంజాయికి బానిసలై చివరకు దాని సరఫరాను వృత్తిగా మార్చుకున్నారు. ఒడిశా సరిహద్దుల్లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, కరీంనగర్, వేములవాడ ప్రాంతాల్లో విక్రయిస్తూ ఆనందాలతో కాలం గడుపుతున్నారు.

సరిహద్దులు దాటిన గంజాయి.. ఒడిశాలో కొనుడు.. కరీంనగర్ పరిసరాల్లో అమ్ముడు
X

దిశ, తిమ్మాపూర్: జల్సాలకు అలవాటుపడి మత్తులో కొట్టుమిట్టాడుతున్న ముగ్గురు యువకులు గంజాయికి బానిసలై చివరకు దాని సరఫరాను వృత్తిగా మార్చుకున్నారు. ఒడిశా సరిహద్దుల్లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, కరీంనగర్, వేములవాడ ప్రాంతాల్లో విక్రయిస్తూ ఆనందాలతో కాలం గడుపుతున్నారు. అయితే వీరి గుట్టు రట్టు చేసిన తిమ్మాపూర్ పోలీసులు వారిని కొత్తపల్లి రాజీవ్ రహదారి వద్ద పట్టుకున్నారు. ఈ ఘటనపై సోమవారం ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గడ్డం సదన్ కుమార్ మీడియాకు వివరాలు అందించారు.


ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో, ఎల్ఎండి ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు కొత్తపల్లి ఎక్స్‌రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, కరీంనగర్ వైపు వస్తున్న ముగ్గురు యువకులు కేటీఎం బైక్ పై వచ్చారు. వారి బ్యాగును తనిఖీ చేయగా, అందులో ఐదు కిలోల గంజాయి లభించడంతో వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు.

అరెస్టు చేసినవారిలో వేములవాడ మండలం నాగయ్యపల్లి గ్రామానికి చెందిన గొంటి నాగేశ్ అలియాస్ బన్నీ (19), కోనరావుపేట మండలం మట్టిమల్ల గ్రామానికి చెందిన చెప్యాల సాత్విక్ అలియాస్ సన్నీ (19), వేములవాడ అర్బన్ కాలనీకి చెందిన కుత్తడి భరత్ అలియాస్ చింటులు ఉన్నారు. వీరు ముగ్గురూ గంజాయి సేవిస్తూ, త్వరగా డబ్బు సంపాదించాలన్న నైతిక వ్యత్యాసంతో గంజాయి సరఫరాకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

ఇందులో భాగంగా నాలుగు రోజుల క్రితం కేటీఎం బైక్ పై ఒడిశా వెళ్లి గంజాయి కొనుగోలు చేసి తిరిగొస్తుండగా పోలీసుల చేతిలో చిక్కారు. వారి వద్ద నుండి ఐదు కిలోల గంజాయి, బైక్, మొబైల్ ఫోన్, గంజాయి రవాణా చేసిన బ్యాగ్‌ను స్వాధీనం చేసుకొని, నిందితులను రిమాండ్‌కు తరలించామని సీఐ సదన్ కుమార్ తెలిపారు. ఈ చర్యలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ శ్రీకాంత్, పోలీస్ సిబ్బందిని ఆయన ప్రశంసించారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా జీవితాన్ని బాగుపర్చుకోవాలని సూచించారు.

Next Story