Fire Accident: ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.లక్షల్లో ఆస్తి నష్టం

by Shiva |   ( Updated:2025-02-10 07:18:25.0  )
Fire Accident: ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.లక్షల్లో ఆస్తి నష్టం
X

దిశ, వెబ్‌డెస్క్/చార్మినార్: పాతబస్తీ మదీనా అబ్బాస్​ టవర్స్‌లో షార్ట్​ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో జరిగింది. మూడో అంతస్తులోని ఓ వస్త్ర దుకాణంలో అంటుకున్న మంటలు పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు వేగంగా విస్తరించాయి. అబ్బాస్ టవర్స్‌లోని రెండు, మూడో ఫ్లోర్లలోని దాదాపు 50 వస్త్ర దుకాణాల వరకు అగ్నికి ఆహుతయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే చార్మినార్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేయగా వారు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. అబ్బాస్​ టవర్స్ రెండు వైపుల ఇతర భవనాలు, ఒక వైపు మసీదు ఉండడంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 12గంటల వరకు కూడా మంటలు అదుపులోకి రాలేదు. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీ మదీనా దివాన్​దేవిడి‌లోని సెల్లార్‌తో పాటు జీ ప్లస్ 3 భవనంలో అబ్బాస్ టవర్స్ విస్తరించి ఉంది.

ఒక్కొక్క ఫ్లోర్‌లో చిన్న, పెద్ద దుకాణాలు కలిపి 640 వస్త్ర దుకాణాలు ఉన్నాయి. మార్చి నెలలో రంజాన్​ పండుగ సందర్భంగా వ్యాపారులు పెద్ద మొత్తంలో ఫుల్ స్టాక్​ తెచ్చి పెట్టుకున్నారు. ఇది ఇలా ఉండగానే సోమవారం తెల్లవారుజామున 1.30గంటల ప్రాంతంలో అబ్బాస్ టవర్స్‌లోని మూడో అంతస్తులోని ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అందులో పెద్ద ఎత్తున రెడీమెడ్ క్లాత్స్ ఉండడంతో వేగంగా ఆ పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు మంటలు విస్తరించాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న చార్మినార్​ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే మూడో అంతస్తు నుంచి రెండవ అంతస్తు కూడా మంటలు వేగంగా విస్తరించాయి. ఆర్ఎఫ్ హరినాథ్‌ రెడ్డి, బీఎఫ్ఎస్ ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో దాదాపు 8 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నప్పటికీ ఇంకా అదుపులోకి రాలేదు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన వ్యాపారులు మొదటి అంతస్తు, సెల్లార్‌లోని వస్త్ర వ్యాపారులు నిల్వ ఉన్న రెడిమెడ్ క్లాత్స్‌ను అక్కడి నుంచి మరో చోటుకు తరలిస్తున్నారు. కాగా, దాదాపు 50 వస్త్ర దుకాణాల వరకు అగ్నికి ఆహుతి అయినట్లుగా సమాచారం. దాదాపు రూ.10 కోట్ల అస్తి నష్టం సంభవించి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.



Next Story