నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. హోంగార్డు సహా ఇద్దరు మృతి

by Kema Shiva Kumar |

హైదరాబాద్‌లో అతివేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో హోంగార్డు సయ్యద్ హుస్సేన్, ర్యాపిడో ప్రయాణికురాలు దుర్మరణం పాలయ్యారు.

నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. హోంగార్డు సహా ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన నగరంలోని జూబ్లీహిల్స్‌ (Jubilee Hills)లో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అతివేగంగా వెనుక నుంచి దూసుకొచ్చిన వాటర్ ట్యాంకర్ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో హోంగార్డు‌తో పాటు ఓ మహిళా ప్రయాణికురాలు దుర్మరణం పాలయ్యారు. మృతుడిని సంతోష్ నగర్ ట్రాఫిక్ హోంగార్డుగా పనిచేస్తున్న సయ్యద్ హుస్సేన్‌ (Sayyad Hussain)గా గుర్తించారు.

అయితే, హుస్సేన్ తన విధి నిర్వహణ ముగిసిన అనంతరం కుటుంబ పోషణ కోసం పార్ట్‌టైమ్‌గా ర్యాపిడో (Rapido) బైక్ టాక్సీ నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే అక్షిత (Akshitha) అనే కస్టమర్‌ను ఆమె గమ్యస్థానానికి చేర్చేందుకు బైక్‌పై తీసుకెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన వాటర్ ట్యాంకర్ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ట్యాంకర్ చక్రాల కింద పడి సయ్యద్ హుస్సేన్, అక్షిత ఇద్దరూ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Next Story