తాటిపర్తి‌లో జంట హత్యల కలకలం

by Malleboina Mahesh |

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. ఇద్దరి మృతదేహాలు బావిలో తేలియాడుతూ కనిపించాయి.

తాటిపర్తి‌లో జంట హత్యల కలకలం
X

దిశ, పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. ఇద్దరి మృతదేహాలు బావిలో తేలియాడుతూ కనిపించాయి. పోలీసులు, స్థానికులు.. ఇద్దరి హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణంగా చెబుతున్నారు. తాటిపర్తి గ్రామానికి చెందిన రంపం గంగాధర్ తన ఇంటి నిర్మాణం కోసం అదే గ్రామానికి చెందిన కుంపట్ల సూరిబాబుకు, రంపం శ్రీను, తోలేటి సూరిబాబుల వద్ద అప్పు తీసుకున్నాడు. ఈ అప్పు తీర్చే క్రమంలో కుంపట్ల సూరిబాబుతో వివాదం ఏర్పడింది. దీంతో తొలుత కుంపట్ల సూరిబాబుపై రంపం గంగాధర్ దాడికి పాల్పడ్డాడు. దాడి నుండి అతడు తప్పించుకుని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా బుధవారం ఉదయం రంపం శ్రీను (45), తోలేటి సూరిబాబు (35) మృతదేహాలు అనూహ్యంగా తాటిపర్తి కొండ కాలువ వద్ద పొలాల్లో ఉన్న బావిలో తేలియాడుతూ కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. కాకినాడ జిల్లా ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్, పిఠాపురం సీఐ శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్సై రామకృష్ణ లు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్ టీం ద్వారా హత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలే ఇద్దరి హత్యకు కారణంగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇంకా లోతుగా విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.

Next Story