ఢిల్లీ జడ్జి ఆత్మహత్య కేసు: భార్యపై అబెట్‌మెంట్ కేసు నమోదు

by Kema Shiva Kumar |

ఢిల్లీ యువ న్యాయమూర్తి అమన్ కుమార్ శర్మ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఢిల్లీ జడ్జి ఆత్మహత్య కేసు: భార్యపై అబెట్‌మెంట్ కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీసెస్‌కు చెందిన 30 ఏళ్ల యువ జడ్జి అమన్ కుమార్ శర్మ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఈ ఉదంతంలో ఆయన భార్య, ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపించడం, క్రిమినల్ కుట్ర కింద కేసులు నమోదు చేశారు. కాగా, దక్షిణ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలో అమన్ కుమార్ శర్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి తండ్రి ప్రేమ్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తన కొడుకు గత 2 నెలలుగా భార్య, ఆమె సోదరి వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడని ఆయన ఆరోపించారు.

ఆత్మహత్యకు ముందు రాత్రి అమన్ తన తండ్రికి ఫోన్ చేసి తనకు బతకడం చాలా కష్టంగా ఉందని, చాలా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తండ్రి స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు బీఎన్‌ఎస్ యాక్ట్‌‌లోని సెక్షన్ 108, 61(2) కింద సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్ పోలీస్ స్టేషన్‌లో నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అమన్ కుమార్ శర్మ 2021లో ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీసెస్‌లో చేరారు. ప్రస్తుతం కర్కర్దూమా కోర్టులో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA) ఫుల్ టైమ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య కూడా జ్యుడీషియల్ ఆఫీసర్‌గా పనిచేస్తుండటం గమనార్హం.

Next Story