తల్లిని చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన కూతురు.. 10 నెలల తర్వాత?

by Naga Rani Yarlagadda |

ప్రియుడి మోజులో తల్లిని చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన కూతురు. 10 నెలల తర్వాత వెలుగుచూసిన దారుణం సికింద్రాబాద్ పరిధిలో ఘటన.

తల్లిని చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన కూతురు.. 10 నెలల తర్వాత?
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నతల్లి ప్రేమను కాదని, ప్రియుడితో సహజీవనం కోసం ఓ కుమార్తె కన్నతల్లినే కిరాతకంగా చంపిన ఘోర ఘటన సికింద్రాబాద్‌లోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. కౌకూర్ భరత్‌నగర్‌లో జరిగిన ఈ హత్యోదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. 10 నెలల క్రితం జరిగిన ఈ దారుణ ఘటనలో నిందితులను బైక్ పట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. జవహర్‌నగర్ పరిధిలోని కౌకూర్ భరత్‌నగర్‌కు చెందిన అంజు అనే మహిళ 10 నెలల క్రితం అకస్మాత్తుగా అదృశ్యమైంది. దీనిపై ఆమె పెద్ద కుమార్తె జవహర్ నగర్ బొల్లారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంజు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ కాల్ డేటా విశ్లేషణతో పాటు స్థానికులను సుదీర్ఘంగా విచారించారు. ఏడాదికాలం గడుస్తున్నా మిస్టరీ వీడకపోవడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ క్రమంలో అంజు చిన్న కూతురైన ఇషికను పోలీసులు మళ్లీ తమదైన శైలిలో విచారించారు. విచారణలో ఇషిక అసలు నిజాన్ని ఒప్పేసుకుంది. తన తల్లి అంజును తానే చంపినట్లు అంగీకరించింది. ఈ హత్యలో తన ప్రియుడు మౌంటీరాజ్ పాత్ర కూడా ఉన్నట్లు వెల్లడించింది. ఇషిక, మౌంటీరాజ్‌లు ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ సహజీవనం చేయాలనుకున్నారు. అయితే, తల్లి అంజు వీరి ప్రేమ వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. కూతురిని మందలించింది. ఈ క్రమంలో తమ ప్రేమకు అడ్డు వస్తున్న తల్లిని వదిలించుకోవాలని ఇషిక నిర్ణయించుకుంది. పక్కా ప్రణాళికతో ఇషిక తన ప్రియుడు మౌంటీరాజ్‌తో కలిసి తల్లి అంజును కిరాతకంగా చంపేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, మృతదేహాన్ని వారి ఇంట్లోనే గుంత తవ్వి పూడ్చిపెట్టారు. పోలీసులు నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, మెజిస్ట్రేట్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు. పది నెలల క్రితం జరిగిన ఈ దారుణం వెలుగుచూడటంతో కౌకూర్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

Next Story