నకిలీ కరెన్సీ గుట్టు రట్టు.. ఇద్దరు నిందితుల అరెస్ట్

by Disha Web Desk 11 |
నకిలీ కరెన్సీ గుట్టు రట్టు.. ఇద్దరు నిందితుల అరెస్ట్
X

దిశ, శంషాబాద్: గుట్టు చప్పుడు కాకుండా నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ కరెన్సీతో పాటు ప్రింటింగ్ మిషన్, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొండుపల్లిలో జరిగింది. శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నకిలీ కరెన్సీ తయారు చేస్తున్నారని పక్కా సమాచారం రావడంతో శంషాబాద్ ఎస్ఓటీ జోన్ ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం ఉదయం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొండుపల్లిలో ఉన్న ఓ హోటల్ పై దాడులు నిర్వహించారు.

అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకు చెందిన తోమండ్ర రంజిత్ సింగ్, మరో నిందితుడు అనకాపల్లి జిల్లా కొవ్వూరు గ్రామానికి చెందిన మలస్ల మోహన్ రావు ఇద్దరు నకిలీ కరెన్సీ తయారు చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి రూ. 8 లక్షల 55 వేలు నకిలీ కరెన్సీ, రెండు సెల్ ఫోన్లు, మానిటర్, యూపీఎస్, లామినేటర్, స్క్రీన్ ప్రింటింగ్ సెటప్, రెండు లేజర్ కలర్ ప్రింటర్లు, కటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు.

ఏ- 1. నిందితులుగా ఉన్న తోమండ్రా రంజిత్ సింగ్ 2013 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో నకిలీ కరెన్సీ తయారు చేస్తూ పట్టుబడడం జరిగింది. అయినా వినకుండా విశాఖపట్నం పామర్రులో కూడా నకిలీకరేజ్ కేసు ఉందన్నారు. ఎ-2 నిందితుడు మలస్ల మోహన్ రావు పై తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పోలీస్టేషన్ లో, విశాఖపట్నం చౌడవరం పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నాయన్నారు. ఇద్దరు సభ్యుల ముఠా 500, 200,100,50 రూపాయల నకిలీపై కరెన్సీ తయారు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.

ఈ ఇద్దరు నిందితులు తమ ఏజెంట్లను సంప్రదిస్తూ ఇతర నకిలీ కరెన్సీ ఏజెంట్లను కూడా టెలిగ్రామ్ ద్వారా సంప్రదిస్తారని, వారు వివిధ రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో తమ ఏజెంట్లతో అసలు కరెన్సీ తో కలిపి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. కూరగాయల మార్కెట్లలో, చిరు వ్యాపారులు పండ్లు మార్కెట్లు, కిరాణా దుకాణాలు, రైతు బజార్లలో రాత్రి పూట రద్దీగా ఉండే సమయంలో అసలు అయిన కరెన్సీ నోట్లతో నకిలీ కరెన్సీ నోట్లు కలిపి చలామణి చేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో శంషాబాద్ ఇన్ స్పెక్టర్ శ్రీధర్ కుమార్, ఎస్ఓటీ ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed