బెట్టింగ్ యాప్స్ కేసులో TG సీఐడీ సంచలనం: 8 రాష్ట్రాల్లో నెట్‌వర్క్.. సెలబ్రిటీలకు లాస్ట్ వార్నింగ్

by Gantepaka Srikanth |

తెలంగాణలో విస్తరిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ నెట్‌వర్క్‌పై రాష్ట్ర సీఐడీ (CID) విభాగం ఉక్కుపాదం మోపింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పర్యవేక్షణలో, సీఐడీకి బదిలీ అయిన ఆన్లైన్ బెట్టింగ్ కేసులపై సుదీర్ఘ విచారణ జరిపి అంతర్జాతీయ ముఠాల గుట్టురట్టు చేసినట్లు సీఐడీ చీఫ్ చారు సీన్లా వెల్లడించారు.

బెట్టింగ్ యాప్స్ కేసులో TG సీఐడీ సంచలనం: 8 రాష్ట్రాల్లో నెట్‌వర్క్.. సెలబ్రిటీలకు లాస్ట్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో విస్తరిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ నెట్‌వర్క్‌పై రాష్ట్ర సీఐడీ (CID) విభాగం ఉక్కుపాదం మోపింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పర్యవేక్షణలో, సీఐడీకి బదిలీ అయిన ఆన్లైన్ బెట్టింగ్ కేసులపై సుదీర్ఘ విచారణ జరిపి అంతర్జాతీయ ముఠాల గుట్టురట్టు చేసినట్లు సీఐడీ చీఫ్ చారు సీన్లా వెల్లడించారు. ఈ మేరకు కేసు వివరాలను ఆమె మీడియాకు వివరించారు. "ఇది దేశవ్యాప్తంగా విస్తరించిన ఒక పెద్ద ఇంటర్నేషనల్ బెట్టింగ్ దందా. ఆన్‌లైన్ బెట్టింగ్స్‌ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రస్తుతానికి ఒక్క ఛాన్స్ ఇస్తూ కౌన్సిలింగ్ ఇచ్చాం. మళ్లీ రిపీట్ అయితే మాత్రం కఠిన చర్యలు తప్పవు." అని చారు సిన్హా హెచ్చరించారు.

కరీంనగర్ 'డాఫా బెట్' కేసు ఛేదించిన సీఐడీ..

కరీంనగర్‌లో నమోదైన ప్రముఖ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ 'డాఫా బెట్' (Dafa Bet) కేసును సీఐడీ విజయవంతంగా ఛేదించింది. 40 మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందం 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా జరిపిన మెరుపు ఆపరేషన్‌లో ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల నుండి 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ బెట్టింగ్ నిర్వాహకులు అమాయకులను ఆకర్షిస్తూ రోజుకు రూ. 8 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు అక్రమంగా సంపాదిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితులు లావాదేవీల కోసం ఉపయోగిస్తున్న 46 మ్యూల్ (ఇతరుల పేరుతో ఉన్న) బ్యాంక్ ఖాతాలను సీఐడీ అధికారులు సీజ్ చేశారు. ఈ ఒక్క డాఫా బెట్ యాప్‌పైనే దేశంలోని 8 రాష్ట్రాల్లో 225 ఫిర్యాదులు అందగా, 73 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సీఐడీ ఇప్పటివరకు 414 కేసులు నమోదు చేసింది. విచారణలో భాగంగా ప్రమాదకరమైన 108 ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్లను గుర్తించిన సీఐడీ, వాటిని పూర్తిగా నిషేధించాలని భారత ప్రభుత్వానికి (కేంద్ర ఐటీ శాఖకు) ప్రతిపాదనలు పంపింది.

సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు కౌన్సిలింగ్..

డబ్బుకు ఆశపడి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను, గేమ్స్‌ను ప్రమోట్ చేస్తున్న వారిపై సీఐడీ ప్రత్యేక నిఘా పెట్టింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన 25 మంది ప్రముఖ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను పిలిపించి సీఐడీ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటి చట్టవిరుద్ధమైన యాప్లను ప్రమోట్ చేయడం నేరమని స్పష్టం చేస్తూ, వారికి ఇదే చివరి అవకాశమని (ఒక్క ఛాన్స్) హెచ్చరించారు. భవిష్యత్తులో మళీ బెట్టింగ్ యాప్ ప్రకటనల్లో కనిపిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐడీ చీఫ్ చారు సిన్హా స్పష్టం చేశారు.

Next Story