స్మృతి మంథాన మాజీ ప్రియుడిపై చీటింగ్ కేసు

by Naga Rani Yarlagadda |

భారత మహిళా క్రికెట్ జట్టులో స్టార్ ప్లేయర్ స్మృతి మంథాన మాజీ ప్రియుడి, సింగర్, సినిమా డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ పై చీటింగ్ కేసు నమోదయింది.

స్మృతి మంథాన మాజీ ప్రియుడిపై చీటింగ్ కేసు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మహిళా క్రికెట్ జట్టులో స్టార్ ప్లేయర్ స్మృతి మంథాన మాజీ ప్రియుడి, సింగర్, సినిమా డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ పై చీటింగ్ కేసు నమోదయింది. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా పోలీసులకు విజ్ఞాన్ మానే అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ప్రకారం.. విజ్ఞాన్ మానే ప్రముఖ క్రికెటర్ స్మృతి మంథానకు చిన్ననాటి స్నేహితుడు. వృత్తిరీత్యా సినిమా ఫైనాన్షియర్. పలాశ్ ముచ్ఛల్ సాంగ్లీకి వచ్చిన సమయంలో, స్మృతి మంథాన తండ్రి శ్రీనివాస్ మంథాన ద్వారా మానేకు ముచ్ఛల్ పరిచయం అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘నజరియా’ అనే సినిమా నిర్మాణానికి పెట్టుబడి పెట్టాలని పలాశ్ ముచ్ఛల్ తనను సంప్రదించాడని మానే ఆరోపించారు. ఈ సినిమా త్వరలో ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో విడుదలై, పెట్టుబడిపై వేగంగా లాభాలు వస్తాయని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆ హామీలను నమ్మి తాను మొత్తం రూ.40 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు మానే పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని పలు విడతల్లో నగదు రూపంలో, అలాగే గూగుల్ పే ద్వారా చెల్లించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన లావాదేవీల ఆధారాలను కూడా ఎస్పీ కార్యాలయానికి సమర్పించారు.

అయితే.. సినిమా నిర్మాణమే పూర్తికాలేదని, డబ్బులు తిరిగి అడిగితే మొదట ముచ్చల్ హామీ ఇచ్చి, ఆ తర్వాత ఫోన్ కాల్స్ ఎత్తడం మానేసి చివరికి తన నంబర్‌ను బ్లాక్ చేశాడని ఫిర్యాదులో ఆరోపించారు. డబ్బుల కోసం కొన్ని నెలలు వెయిట్ చేసి, చివరికి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. విజ్ఞాన్ సమర్పించిన పత్రాలు, లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

Next Story