పీఎంఓ అధికారినంటూ మోసాలకు పాల్పడ్డ వ్యక్తి.. సీబీఐ కేసు నమోదు

by Malleboina Mahesh |   (  Updated:2025-10-07 09:10:28  IST  )

ఢిల్లీలోని రాజేంద్రనగర్ నివాసి పి. రామారావు అనే వ్యక్తి, ప్రధాని కార్యాలయం(PMO)లో జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీగా తనను పరిచయం చేసుకున్నాడు

పీఎంఓ అధికారినంటూ మోసాలకు పాల్పడ్డ వ్యక్తి.. సీబీఐ కేసు నమోదు
X

దిశ వెబ్ డెస్క్: పీఎంఓ అధికారినంటూ మోసాలకు పాల్పడిన వ్యక్తిపై తాజాగా సీబీఐ కేసు (CBI case) నమోదు అయింది. ఢిల్లీలోని రాజేంద్రనగర్ నివాసి పి. రామారావు అనే వ్యక్తి, ప్రధాని కార్యాలయం(PMO)లో జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీగా తనను పరిచయం చేసుకున్నాడు. అనంతరం అనేక ప్రభుత్వ సంస్థలను మోసపరిచేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారం అందుకున్న PMO అసిస్టెంట్ డైరెక్టర్ అనిల్ శర్మ అక్టోబర్ 6న సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ నకిలీ అధికారి రామారావు సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అధికారులకు ఫోన్ ద్వారా MBA కోర్సులో అడ్మిషన్ కోసం తనను జాయింట్ సెక్రటరీగా పరిచయం చేసుకున్నాడు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కి అధికారిక లేఖ రాసి మే 10న ‘సుప్రభాతం దర్శనం’ కోసం 10 మందికి AC డబుల్ బెడ్ గదులు ఏర్పాటు చేయాలని కోరాడు.

అలాగే మైసూరు ప్రాంతాల్లో భూముల రికార్డులు పొందేందుకు సీ శ్రీధర్ అనే వ్యక్తితో కలిసి ప్రయత్నించినట్లు కూడా సమాచారం. సీబీఐ అధికారుల విచారణలో రామారావుకు PMOలో ఉద్యోగం లేదని తేలింది. దీంతో అతడిపై IPC సెక్షన్లు 419, 420, 468, IT చట్టం కింద కేసులు నమోదయ్యాయి. రామారావు తన నకిలీ అధికార పదవులను వాడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులను బురిడీ కొట్టే ప్రయత్నాలు చేసినట్లు ఆధారాలు లభించాయి. సీబీఐ ఈ కేసును మరింతగా దర్యాప్తు చేస్తోంది. అలాగే ప్రజలను అప్రమత్తంగా ఉండమని, అనుమానాస్పద అధికారుల వేషధారణలను గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సీబీఐ సూచిస్తోంది.

Next Story