అవకాశాలు కల్పిస్తానంటూ యువతికి మోసం.. వెబ్‌సిరీస్ దర్శకుడిపై కేసు నమోదు

by Kema Shiva Kumar |

సినిమా అవకాశాల పేరుతో యువతిని నమ్మించి, అసభ్యకరంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెబ్ సిరీస్ దర్శకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

అవకాశాలు కల్పిస్తానంటూ యువతికి మోసం.. వెబ్‌సిరీస్ దర్శకుడిపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమలో రాణించాలనుకునే యువతుల ఆశలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా, సినీ అవకాశాలు కల్పిస్తానంటూ ఓ యువతిని నమ్మించి, ఆమెను మోసం చేయడమే కాకుండా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ఓ వెబ్‌సిరీస్ దర్శకుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ (Jubilee Hills) పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. సదరు వెబ్‌సిరీస్ (Web Series) దర్శకుడు ఒక యువతికి సినిమాల్లో మంచి అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. షూటింగ్ పేరుతో ఆమెను తీసుకెళ్లి, అసభ్యకర రీతిలో చిత్రీకరణ జరిపాడు. అంతటితో ఆగకుండా, ఆమె అనుమతి లేకుండా ఆ అసభ్యకర దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో తన వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నట్లు గమనించిన బాధితురాలు షాక్‌కు గురైంది. వాటిని వెంటనే తొలగించాలని ఆమె దర్శకుడిని కోరింది. అయితే, ఆ వీడియోలను తొలగించడానికి నిరాకరించిన సదరు దర్శకుడు, ఆమెను మరింతగా వేధిస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. దీంతో చేసేదేమీ లేక బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.

కేసు నమోదు.. దర్యాప్తు షురూ

యువతి ఫిర్యాదు మేరకు నిందితుడైన దర్శకుడిపై పోలీసులు ఐటీ చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో పెట్టిన ఆ వీడియోలను తొలగించే ప్రక్రియను చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Next Story